Harish Rao | మధ్యాహ్న భోజనం పథకం అమలులో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉడకని అన్నం.. నీళ్ల సాంబారు పెట్టిన ఘటనపై మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మధ్యాహ్న భోజన పథకం బాగోలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే.. ఇక రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని హరీశ్‌రావు అన్నారు. విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉందో కోస్గి ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే తెలిసిపోతుందని విమర్శించారు.
నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం ప్రాథమిక పాఠశాలలో సుమారు 40 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద పెట్టే భోజనం విషయంలో ఇక్కడ కొంతకాలంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సర్గి ఉడకని అన్నం, నీళ్లలాంటి సాంబారు పెడుతున్నారు. గుడ్డు, అరటి పండు అయితే నెలకోసారి మాత్రమే ఇస్తున్నారు. అన్నం ఒక్కసారి మాత్రమే వడ్డిస్తున్నారు. ఈ విషయాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళారు. కానీ వారు మారలేదు. దీంతో కొంతమంది విద్యార్థులు ఇంటికెళ్లి భోజనం చేస్తుంటే.. మరికొందరు టిఫిన్లు తెచ్చుకుంటున్నారు.
మధ్యాహ్న భోజన పథకం విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బుధవారం నిరసన తెలిపారు. దాదాపు గంటన్నరపాటు నిరసన తెలపడంతో.. ఎంఈవో శంకర్ నాయక్ హుటాహుటిన పాఠశాలకు చేరకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎంఈవోకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరిస్థితిని వివరించారు.