Harish Rao | కేసీఆర్ ఆనవాళ్లు మార్చడం అంటే గురుకుల విద్యార్థులను ఆస్పత్రి పాలు చేయడమా? వారిని పొట్టన పెట్టుకోవడమా అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ 284 గా ఉన్న గురుకులాలను 1,023 గురుకులాలకు పెంచితే.. రేవంత్ రెడ్డి వాటిని ఆగం చేస్తున్నాడని మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి కలుషితాహారంతో అస్వస్థతకు గురైన విద్యార్థినిలను హరీశ్‌రావు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. నాగర్‌కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడం వల్ల 111 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మేము వస్తున్న విషయం తెలుసుకొని హడావుడిగా పోలీసులను పెట్టి పిల్లలను తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారని తెలిపారు. ఇంకొంతమంది విద్యార్థులకు చేతికి క్యాండిల్ తోనే చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎందుకు దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నిలదీశారు. పిల్లలకు మంచి భోజనం పెట్టకుండా, వారికి సరైన వైద్యం అందించకుండా ఎందుకు హడావిడిగా తీసుకొచ్చారని ప్రశ్నించారు.
ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలే జరుగుతున్నాయని హరీశ్ రావు తెలిపారు. ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో మొన్న పెద్దకొత్తపల్లి హాస్టల్లో విషపూరిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారని గుర్తుచేశారు. జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెంలలో విషాహారం తిని ఆసుపత్రిపాలయ్యారని అన్నారు. హుస్నాబాద్ బీసీ గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికి విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని చెప్పారు. ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో ఏదోచోట గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆసుపత్రుల పాలైన వార్తలు చూడవలసి వస్తున్నదని తెలిపారు. 20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో వందమంది గురుకుల విద్యార్థులు చనిపోయారని మండిపడ్డారు. వందమంది విద్యార్థులు చనిపోయినా మీ గుండె కరగదా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అంటే ఏమిటి రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆనవాళ్లు మార్చడం అంటే విద్యార్థులు గురుకుల నుండి టీసీలు తీసుకుని వెళ్లిపోవడమా అని అడిగారు. ఆనవాళ్లు మార్చడం అంటే గురుకుల పిల్లలను ఆసుపత్రి పాలు చేయడమా? ఆ పిల్లలను పొట్టన పెట్టుకోవడమా అని ప్రశ్నించారు. కేసీఆర్ 284 గా ఉన్న గురుకులాలను 1,023 గురుకులాలకు పెంచిండని గుర్తుచేశారు. 1,60,000 మంది ఉన్న గురుకులాల్లో కేసీఆర్ ఆరు లక్షల మంది విద్యార్థులు చదివే సౌకర్యాలు కల్పించారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గురుకులాలను ఆగం చేశాడని మండిపడ్డారు.
బీసీ హాస్టల్లో ఇంకా బెడ్ షీట్స్ రాలేదు. కాస్మోటిక్ బిల్లులు రాలేదు. కొన్ని హాస్టల్లో ఇంకా విద్యార్థులకు బట్టలు కూడా రాలేదని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో రేవంత్ రెడ్డి హయాంలో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు. ఆత్మ విమర్శ తీసుకో రేవంత్ రెడ్డి అని సూచించారు. రాజకీయాలు ఉంటే ఎన్నికలప్పుడు చేసుకుందాం.. కేసీఆర్ మీద, మా మీదన కోపం ఉంటే కేసులు పెట్టు.. కానీ విద్యార్థులను ఇబ్బంది పెట్టకు అని కోరారు. నీ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.