Harish Rao | రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. సిగ్గులేకుండా సంబరాలు చేయమంటున్నారని.. కానీ గ్రామాలకు వస్తే కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీస్తున్నారని తెలిపారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నిలబెట్టుకుందా అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి 9 వేల రూపాయలను ఏటా రైతులను ముంచుతున్నదని హరీశ్‌రావు తెలిపారు. వానాకాలం గుండు సున్నా.. యాసంగికి ఎగవేతలు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఊర్లోకి వస్తే ఎకరాకి 15 వేలు ఇవ్వాల్సిందే అని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్క పంటకు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వడం లేదని.. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి నోరు పెంచి అరిచారని అన్నారు. అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తానని చెప్పి 9 వేలు ఎగ్గొట్టి ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే కేవలం పది లక్షల మందికి మాత్రమే రైతు భరోసా అంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఉపాధిలో 90 లక్షల మందికి ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. ఒక ఎకరం భూమి ఉన్న వారిని కూడా రైతులుగా గుర్తించి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి ఉన్నోళ్లకు నష్టం.. భూమి లేనోళ్లకు లాభం కలిగించేలా సర్కారు చర్యలు ఉన్నాయని విమర్శించారు. ఉపాధి హామీలో మట్టిపనికి పోయేటోల్లకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపాదనలు చేసేటప్పుడు కనీస సోయి లేకుండా పోయిందని.. మెడమీద తలకాయ ఉన్నోళ్ళు ఇట్లా చేస్తారా అని అన్నారు. మట్టిపనికి పొయెటోల్లంతా కూలీలే.. వారందరికీ వ్యవసాయ కూలీలుగా గుర్తించి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కనపడ్డ దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అన్నాడని.. ఏడాది గడిచినా ఇంతవరకు రైతు రుణమాఫీ కాలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి బుకాయింపులు మాని ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గుండాలతో కొట్టించుడు, చిల్లరగాల్లతో తిట్టించుడు మానుకోవాలని హితవు పలికారు. అడుగడుగునా దగాతో రైతుల్ని నట్టేట ముంచారని మండిపడ్డారు. అసెంబ్లీ లో చెప్పిన మాటలు కూడా తప్పుతున్నారని అన్నారు. పది పంటలకు బీమా అని చెప్పి ఒక్క పంటకే ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు ఓట్లు గల్లల వేసుకోవడానికి ఇచ్చిన ప్రధానమైన ఐదు హామీలు కాంగ్రెస్ నెరవేర్చాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.