Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారని అన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇస్తానన్నడు, 20 నెలల్లో ఒక్కో ఆడబిడ్డకు 50వేల రూపాయలు బాకీ పడ్డడని చెప్పారు. తులం బంగారం ఇస్తానన్నాడు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానన్నాడు.. కానీ మాట తప్పిండని మండిపడ్డారు. యువత, రైతులు, మహిళలు.. అన్ని వర్గాలను మోసం చేసిండు రేవంతు అని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని సోమవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు తగ్గిపోయాయని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో పది ఎకరాలు కొనవచ్చని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యాక రెండేండ్లలోనే సీన్ రివర్స్ అయ్యిందని అన్నారు. రేవంత్ రెండేళ్ల పాలనలో మొత్తం ఉల్టా అయి భూముల రేట్లు తగ్గిపోయాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇంకో రెండేళ్లు ఉంటే పాత రోజుల్లోలా ఏపీలో ఎకరా కొనాలంటే తెలంగాణలో పదెకరాలు అమ్మే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో వేసవిలోనూ పంటల సాగుకు తగినంత నీరు ఇచ్చామని గుర్తుచేశారు. గతంలో హల్దీ వాగులో లిఫ్ట్ పెట్టి గద్దర్ వాళ్ల ఊరికి నీళ్లు వచ్చేలా చేశామని తెలిపారు. కేసీఆర్ పాలనను గద్దర్ కూడా మెచ్చుకున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసగించారని మండిపడ్డారు. రుణమాఫీ చేసింది 30 పైసలు అయితే.. ఎగ్గొట్టింది 70 పైసలు అని ఎద్దేవా చేశారు. యాసంగికి సంబంధించి సన్న వడ్లకు బోనస్ రాలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఎప్పుడైనా యూరియా కోసం లైన్లో నిలబడ్డామా అని అడిగారు. కానీ కాంగ్రెస్ వచ్చింది.. మళ్లీ ఇవాళ యూరియా కోసం పాస్ పుస్తకాలు, చెప్పులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, కరెంటు.. ఇవేవి ఇవ్వలేని చేతగాని కాంగ్రెస్ సర్కారు అని ఎద్దేవా చేశారు.