Harish Rao | బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వైద్య రంగం ఉన్నత శిఖరాలకు చేరిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అనేక విప్లవాత్మక పథకాలకు, తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేసిందని తెలిపారు.
నిర్దిష్టమైన ప్రణాళిక, పటిష్టమైన చర్యలతో వైద్యరంగంలో అట్టడుగున ఉన్న తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిందని హరీశ్‌రావు అన్నారు. కానీ ఈ తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో వైద్య, ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని మళ్లీ.. “నేను రాను బిడ్డ సర్కారు దవాఖానానకు” అనే రోజులు పునరావృతం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని హరీశ్‌రావు అన్నారు. బీ ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాస్పటల్స్ ఘనతను చాటేలా వార్తలు వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆసుపత్రుల అధ్వాన్న పరిస్థితుల గురించి రోజూ వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “పడకేసిన ప్రజారోగ్యం, రోగుల మందులు ఎలుకల పాలు, కుర్చీలోనే గర్భిణీ డెలివరీ, ఒకే బెడ్ పై ముగ్గురికి ట్రీట్మెంట్” ఇవన్నీ ఈ ఒక్క రోజు పత్రికల్లో వైద్య ఆరోగ్యశాఖపై నిర్వాకంపై వచ్చిన వార్తా కథనాలు అని ప్రస్తావించారు. ప్రజారోగ్య సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వా నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని తెలిపారు.
వానాకాలం వస్తున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఆస్పత్రుల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించకపోవడం పారిశుధ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల మలేరియా, డెంగీ లాంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. పల్లె, పట్టణం అని తేడా లేకుండా వైరల్ ఫీవర్లతో ప్రతి ఇద్దరిలో ఒకరు బాధపడుతున్నారని.. ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గడచిన నెలన్నర కాలంలో 5246 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే 36% డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయని అన్నారు. జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? అని మండిపడ్డారు.
మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఏమని సమాధానం చెబుతుందని నిలదీశారు. మీకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేకపోవడం శోచనీయమని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతోమంది కుటుంబాల్లో అంతులేని దుఃఖాన్ని మిగిలించిందని అన్నారు. ఈ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని స్పష్టం చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. మరణించిన వారికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటే ఇంకా ఎన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వైద్య ఆరోగ్యశాఖపై అత్యవసర సమీక్ష నిర్వహించాలని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.