Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. కాసేపటికి వదిలేశారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీశ్‌రావు నిరుద్యోగ యువతతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాలు తిప్పి ప్రచారం చేసుకున్నారని తెలిపారు. ఇన్ని చేసి గద్దెనెక్కినంక విద్యార్థులను మరిచిపోయారని మండిపడ్డారు. మొదటి క్యాబినెట్లోనే జాబ్ క్యాలెండర్ అని చెప్పి.. 8 నెలల తర్వాత జాబ్ క్యాలెండర్లో ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే ఎవరు ఇచ్చారనేది ఉంటుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్లో పేరు, సంతకం లేదని తెలిపారు. ఒక చిత్తు కాగితంలాగా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించారని మండిపడ్డారు.
చర్చ కూడా లేకుండానే జాబ్ క్యాలెండర్‌ను ఉప ముఖ్యమంత్రి చదివి వెళ్లిపోయారని హరీశ్‌రావు తెలిపారు. లక్షలాది మంది యువతీయువకుల కంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా అని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్‌పై చర్చ చేయమంటే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. దమ్ముంటే మాట్లాడాలని కదా అని నిలదీశారు. మిమ్మల్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
అభయ హస్తం మానిఫెస్టోలో చెప్పినవి ఒక్కటీ అమలు చేయలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. మీరు ఉద్యోగాలు ఇచ్చింది నిజమైతే గన్‌మెన్ లేకుండా అశోక్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని సవాలు విసిరారు. డేట్, టైమ్ చెబితే తాను వస్తానని తెలిపారు. నిరుద్యోగ యువత నుంచి ఎన్ని రోజులు దాక్కుంటారని ప్రశ్నించారు. ఎక్కువ రోజులు తప్పించుకోలేరని అన్నారు. యువతకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్రెడిబులిటీ ఉంటే వచ్చి సమాధానం చెప్పాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగ యువతతో తానే ఏఐసీసీ కార్యాలయానికి వచ్చి నిలదీస్తామని హెచ్చరించారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంలో అన్నీ ఆంక్షలేనని.. అడిగితే కేసులు పెడతారని విమర్శించారు. ఉద్యోగాల గురించి అడిగితే కేసులు పెడుతరా.. ట్రోలింగ్ చేస్తరా అని నిలదీశారు. తెలంగాణ నిరుద్యోగ యువతను కాంగ్రెస్ దగా చేసిందని మండిపడ్డారు. శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. శాసనసభ కౌరవ సభగా మారిందని విమర్శించారు. ఇది ఉద్యమాల గడ్డ అని, దబాయింపులకు తావు లేదన్నారు. తమను బెదిరింపులు ఏం చేయలేవని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాకా కాంగ్రెస్ పార్టీ వెంటబడుతామని స్పష్టం చేశారు. మేం ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామకపత్రాలు ఇచ్చారని మండిపడ్డారు. మీ ప్రభుత్వం వచ్చినంక ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా దమ్ముంటే సమాధానం చెప్పాలని నిలదీశారు.