Harish Rao | ఉద్యోగాల విషయంలో రేవంత్ తీరు, రెండో ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్ ప్రచార శాఖ మంత్రిగా పని చేసిన గోబెల్స్ తీరును మించిపోయిందని హరీశ్‌రావు విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రకటన చేయడం హాస్యాస్పదమని అన్నారు.
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 61వేల పోస్టులు భర్తీ చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఒక్క పోలీసు శాఖలోనే 30,731 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 16,337 పోస్టులను గుర్తించి, నోటిఫికేషన్ జారీ చేసి, రాత పరీక్ష నిర్వహించి, ఫిజికల్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్.. నియామక పత్రాలు ఇచ్చేందుకు అడ్డంకిగా మారిందని అన్నారు. ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన నువ్వు మేమే భర్తీ చేసినట్లు గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టాడని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఉన్న పోలీసులకు ఈ వాస్తవం తెలియదనుకుంటున్నావా అని నిలదీశారు. ఇది చాలదన్నట్లు 90 రోజుల్లో మొత్తం 30వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినమని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు వంద సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవని వ్యాఖ్యానించారు.ఉద్యోగాల గురించి వివరాలు కావాలంటే ఫైనాన్స్ శాఖ నుంచి వివరాలు తెప్పించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సూచించారు. అంతేగాని అబద్దాలు ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించకని హితవు పలికారు.
ఉద్యోగాల విషయంలో రేవంత్ తీరు,
2వ ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్
ప్రచార శాఖ మంత్రిగా పని చేసిన గోబెల్స్ తీరును మించిపోయింది.పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రకటన చేయడం హాస్యాస్పదం.
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్… pic.twitter.com/UoVCozh51r
— Harish Rao Thanneeru (@BRSHarish) October 21, 2024
సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్, హాల్ టికెట్లు ఇచ్చింది కేసీఆర్, పరీక్ష నిర్వహించింది కేసీఆర్, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. వంటంత అయినంక వచ్చి గంటె తిప్పినట్లు, దాదాపు అన్ని ప్రక్రియలు పూర్తయిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామకపత్రాలు ఇచ్చి డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మే రోజులు పోయాయని అన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపిన మీ మోసపూరిత వైఖరిని తెలంగాణ యువత మరిచిపోదని తెలిపారు.
గ్రూప్1 అభ్యర్థుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆకాంక్షలను కాలరాస్తూ కర్కశంగా, కఠినంగా వ్యవహరించిన మిమ్మల్ని తెలంగాణ సమాజం క్షమించదని హరీశ్‌రావు హెచ్చరించారు. భవిష్యత్ ప్రభుత్వ ఉద్యోగులను లాఠీలతో కొట్టి, అక్రమంగా అరెస్టులు చేసి అర్ధరాత్రి పోలీసు స్టేషన్లలో ఉంచిన మీ దుర్మార్గ వైఖరిని విస్మరించదని స్పష్టం చేశారు. ఉద్యోగాల ఆశ చూపి మోసం చేసి అధికారంలోకి వచ్చిన మీకు.. మీ చేతిలో మోసపోయిన విద్యార్థులు, నిరుద్యోగులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.