Harish Rao | బీసీలకు 42శాతం కోటా పేరిట సీఎం రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లిన చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ రాలేదని.. మాకు బీసీల కన్నా బిహారే ముఖ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాలేదని తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన బీసీ ధర్నాపై హరీశ్‌రావు ట్విట్టర్(ఎక్స్) వేదికగా విమర్శలు గుప్పించారు.
మీ ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు 42శాతం కోటా అమలు చేస్తారనే మాటలపై నమ్మకం రాహుల్ గాంధీ, ఖర్గే లతో పాటు, తెలంగాణ ప్రజలకు కూడా లేదని సుస్పష్టం అయ్యిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘మేం గుజరాత్ లో అడగలేదు, ఉత్తర్ ప్రదేశ్ లో అడగలేదు, మహారాష్ట్రలో అడగలేదు తెలంగాణలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అడుగుతున్నాం’’ అని రేవంత్ రెడ్డి ప్రసంగిస్తే.. అదే సమయంలో రాహుల్ గాంధీ గారూ.. ‘‘ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదు, యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటం’’ అని ట్వీట్ చేస్తరు. ఒకే రోజు, ఒకే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదని విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో రెండు నాల్కల ధోరణి చూస్తేనే అర్థమవుతున్నదని అన్నారు.
‘ మీరు ప్రజలను కొన్నిసార్లు మోసం చేయవచ్చు లేదా కొంతమంది ప్రజలను అన్నిసార్లు మోసం చేయవచ్చు. కానీ అందర్నీ అన్ని సమయాల్లో మోసం చేయలేరు ‘ అని అబ్రహం లింకన్ చెప్పిన నీతి వాక్యాన్ని ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రస్తావించారు.