Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి తొండి చేయడంలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్ అని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు సెటైర్ వేశారు. ఈ రెండు విషయాల్లో ఆయన్ను కొట్టేవాడు లేరని విమర్శించారు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు భేషరతుగా రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
రుణమాఫీ కాలేదని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని.. రైతులు ధర్నా చేస్తున్నారని.. ప్రధాన ప్రతిపక్షంగా తాము సాక్ష్యాలతో చెబుతున్నామని హరీశ్‌రావు అన్నారు. ఇంత జరుగుతున్నా కళ్లు, చెవులు, నోరులేనట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో ప్లాఫ్ అని స్పష్టమవుతుందని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో చూస్తే హాస్టళ్లలో ఎలుకలు కొరుకుతున్నాయి.. డెంగ్యూ, మలేరియాతో ఆస్పత్రుల్లో మంచాలు దొరకట్లేవు.. పల్లెల్లో పారిశుద్ధ్యం పడకెక్కింది.. అంత గందరగోళంగా మారిందని తెలిపారు.
రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డి టాప్ అని హరీశ్‌రావు అన్నారు. తొండి చేయడంలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్.. ఇందులో ఆయన్ను దాటేటోడు ఎవరు లేరని విమర్శించారు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు రేవంత్ రెడ్డి భేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చోర్ ఉల్టా కొత్వాల్‌కే డాంటే అన్నట్టుగా తానే రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీలో కోత.. మాటలేమో రోత అన్నట్టుగా రేవంత్ రెడ్డి వైఖరి ఉందన్నారు. బూతులు తిడితే రైతు రుణమాఫీ పూర్తవుతుందా? అని ప్రశ్నించారు. రంకెలు వేస్తే అంకెలు మారిపోవని, అబద్ధాలు నిజమైపోవని తెలిపారు. నీ తిట్లతో రైతుల ఖాతాలో కోట్ల రూపాయలు పడవని స్పష్టం చేశారు. మమ్మల్ని తిట్లు తిడతవు కావచ్చు కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్ల మరిచిపోతావని ప్రశ్నించారు.
పాలకుడిగా రేవంత్ రెడ్డి పాపాలు మూటగట్టుకున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. పాలకులు పాపం చేస్తే రాష్ట్రానికి లత్త కొడుతుందని ప్రజలు భయపడుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డిగా ప్రమాణం చేస్తే మాకు ఇబ్బంది లేదని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి దేవుళ్లను మోసం చేశావని అన్నారు. రైతులకు తీరని ద్రోహం చేశావు.. దేవుళ్లకు తీరని అపచారం చేశావని మండిపడ్డారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి, మాట తప్పిన పాపం ఊరికే పోదని అన్నారు. అది రాష్ట్రానికి చుట్టుకుంటుందేమోనని దేవుణ్ని నమ్మేవాళ్లు భయపడుతున్నారని తెలిపారు. నీ పాపం ప్రజలకు శాపంగా మారకూడదనే.. ఆ దేవుళ్ల దగ్గరికీ తానే వెళ్తానని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగవద్దని దేవుళ్లను కోరుకుంటా అని అన్నారు. అన్ని దేవాలయాలకు వెళ్తా.. మెదక్ చర్చికి వెళ్తా.. జహంగీర్‌పీర్ దర్గాకు వెళ్తా అని తెలిపారు. ఈ పాపాత్ముడు రైతులను మోసం చేసిండు.. నిన్ను మోసం చేసిండు.. కానీ ఈ పాపాత్ముడు వేసిన పాపానికి ప్రజలను శిక్షించకు అని వేడుకుంటా అని పేర్కొన్నారు.