Harish Rao | కేసీఆర్ పేరు తీయకుండా ఒక్క ఉపన్యాసం అన్న ఇచ్చినవా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. దావోస్ పోతే కూడా కేసీఆర్ యాది కోస్తున్నాడు నీకు అని అన్నారు. ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్ ను తిట్టుడు తప్పా చేసిందేమి లేదంటే అది మీకు పరిపాలన చేతగాని తనానికి పరాకాష్ట అని విమర్శించారు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండని.. ఈ రోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికే అని అంబేద్కర్ ను కూడా మోసం చేశాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
ఆదివారం జరిగిన గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గజ్వేల్ చరిత్రలో చరిత్రలో ఈ ఐదేళ్లు స్వర్ణయుగం అనే చెప్పాలని అన్నారు. నా భూతో న భవిష్యత్ ఇంత గొప్ప అవకాశం ఏ సర్పంచ్‌కు, వార్డు మెంబర్లకు, ఏ కౌన్సిలర్‌కు.. ఎవరికీ దొరకని అదృష్టం మీకు దొరికిందని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లలో గజ్వేల్ దశ దిశ మారిందని హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్ రూపు రేఖలు మారినాయని.. ఎన్నిరోజులైనా గజ్వేల్ చరిత్రలో మీ పేరు నిలిచిపోతుందని చెప్పారు. ఈ ఐదేళ్లలో సాగునీరే కాదు తాగు నీరు కూడా వచ్చిందని.. గజ్వేల్‌కు రింగ్ రోడ్డు, హైదరాబాద్ తర్వాత ఆరు లైన్ల రింగ్ రోడ్డు రావడం చిన్న విషయం కాదని తెలిపారు.
ఒకనాడు ఇడుపు కాగితాలను వేదికైన పాండవుల చెరువు.. ఈ రోజు పిల్లా పాపలతో కలకళలాడుతుందని హరీశ్‌రావు తెలిపారు. ఒక అద్భుతమైన టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందిందని అన్నారు. గజ్వేల్‌కు జిల్లా ఆసుపత్రి వచ్చింది.. రైలు వచ్చింది.. విద్య.. వైద్యం.. మౌళిక సదుపాయాలకు అన్నిటికీ కేంద్రంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ రకంగా గజ్వేల్ దశ దిశ మార్చిన కేసీఆర్ నాయకత్వంలో కౌన్సిలర్లుగా పనిచేయడం ఇది మీ అందరి అదృష్టమని వ్యాఖ్యానించారు. ఎంత పని చేసినా ఇంకా కొంత పని మిగిలే ఉంటుందని.. ప్రజలకు కొరత ఉంటుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక్క పనైనా జరిగిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చింది.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి బంద్ అయిపోయిందని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. మొదలు ప్రజాపాలన దరఖాస్తు అన్నరని.. మొన్ననేమో కులగణన పేరు మీద సర్వే అని దరఖాస్తులు పెట్టించిండని.. ఇప్పుడేమో గ్రామసభల పేరు మీద మల్ల దరఖాస్తులు అంటుండు.. అప్లై.. అప్లై.. నో రిప్లై.. అన్నట్లు అయిపోయిందని ఎద్దేవా చేశారు.
ఇయ్యాల రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండని హరీశ్‌రావు మండిపడ్డారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇయ్యలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ 11 విడతల్లో 73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండని తెలిపారు.13 లక్షల మందికి లక్ష రూపాయల చొప్పున తిప్పలు పడకుండ కళ్యాణ లక్ష్మి ఇచ్చినామని.. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చారని చెప్పారు. ఏ పథకాన్ని అయినా దరఖాస్తు లేకుండా కేసీఆర్ అందరికీ అందించారని పేర్కొన్నారు. దరఖాస్తుల పేరు మీద పెదల ఉసురు తీసుకుంటున్నవు తప్పా.. చేసిందేం లేదని మండిపడ్డారు.