Harish Rao | స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని యువతకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
హిందూ మత ఔన్నత్యాన్ని, భారత దేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వం, వైభవాన్ని ప్రపంచ సర్వమత మహాసభలో స్వామి వివేకానంద చాటి చెప్పారని హరీశ్‌రావు అన్నారు. తన ప్రసంగాలతో భారత జాతిని మేల్కొల్పారని తెలిపారు. దేశ యువతలో ఆత్మ విశ్వాసాన్ని నింపడంతో పాటు వారికి కర్తవ్యాన్ని బోధించారని చెప్పారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలన్నారు.
అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్‌లో లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడాన్ని, గృహ నిర్భంధం చేయడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు తెర లేపడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీసు బలం ఉపయోగించి, ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని అన్నారు. అక్రమ అరెస్టులు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.