Harish Rao | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు అతీగతీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. 1.5 లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని.. దీనికోసం 25 వేల ఇండ్లు కూల్చేందుకు సిద్దమయ్యారని అన్నారు. ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆటో కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆటో కార్మికులకు ఖాకీ యూనిఫాంలను హరీశ్‌రావు అందజేశారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా అక్కడ నివసిస్తున్న ప్రజల ఇండ్లు కూల్చేస్తుండటంతో ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేల కుటుంబాలను ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. పేదల బతుకు ముఖ్యమా? సుందరీకరణ ముఖ్యమా అని ప్రశ్నించారు. సీఎం నిర్ణయంతో లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైడ్రా పేరిట చేస్తున్న డ్రామాలను ఆపేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు హితవు పలికారు. రేవంత్ రెడ్డికి కూల్చడం తప్ప నిర్మించడం రాదని ఎద్దేవా చేశారు. మూసీని సుందరీకరిస్తే ఎవరి బతుకులు బాగుపడతాయని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ, హైడ్రా కాదు.. ముందు గ్రామాల్లో అభివృద్ధి చూడాలని హితవు పలికారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 56 మంది ఆటో కార్మికులు చనిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరామర్శించలేదని హరీశ్ రావు అన్నారు. ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని నిలదీశారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని అన్నారు. రైతుబంధు ఏమైంది? కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? అని ప్రశ్నించారు. రుణమాఫీ సంగతేంటని నిలదీశారు. సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు.. కానీ అందరికీ రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
సిద్దిపేట ఆటో సొసైటీ దేశానికే ఆదర్శమని హరీశ్‌రావు కొనియాడారు. ఈ సొసైటీ కింద ఆటో డ్రైవర్లకు 2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నామని.. ఆర్థిక అవసరాలు ఉన్న వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు సొసైటీ కింద రూ.2.10 కోట్ల రుణాలను ఇచ్చామని తెలిపారు. 26 మంది ఆటో కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చామని పేర్కొన్నారు. మద్యం, గుట్కా అలవాట్లను మానుకోవాలని, కుటుంబాలను బాగా చూసుకోవాలని ఆటో డ్రైవర్లకు హరీశ్‌రావు సూచించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మరీ ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగా కొట్లాడతానని తెలిపారు. సిద్దిపేట ఆటో కార్మికుల కోసం పెట్రోల్ బంక్ మంజూరు చేయిస్తానని చెప్పారు.