హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతున్నదని, ముందుగా గోదావరి బనకచర్లతో జలదోపిడీకి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్.. నష్టనివారణ కోసం గోదావరి నల్లమల సాగర్‌కు మార్చుకుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే, పాత్రధారి రేవంత్ రెడ్డి అని చెప్పారు. కత్తి చంద్రబాబుదే అయినా పొడిచేది మాత్రం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. రేవంత్‌రెడ్డి తీరును ఎండగట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ద్రోహం చేస్తున్నడు సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. ‘అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నడా.. లేదంటే చంద్రబాబుకు
గురుదక్షిణ చెల్లించుకుంటున్నడా నాకైతే అర్థమైతలేదు’ అని వ్యాఖ్యానించారు.
రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతున్నడని ఆరోపించారు. బనకచర్ల విషయంలో కూడా ఎన్నో అబద్ధాలు చెప్పిండని తెలిపారు. ఆయన మాటలకు, చేతలకు పొంతనే ఉండట్లేదని మండిపడ్డారు.