Harish Rao | రేవంత్ రెడ్డి ఎంతసేపు తనను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. నీ చరిత్ర ఏంటో.. నా చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. నీలా మాట తప్పేటోణ్ని కాదని స్పష్టం చేశారు. గతంలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ రెడ్డి చేసిన సవాలును గుర్తుచేశారు. కొడంగల్‌లో ఓడిపోలేదా? రాజకీయ సన్యాసం తీసుకున్నావా? అని నిలదీశారు. మాటతప్పిన చరిత్ర నీకు ఉన్నదని మండిపడ్డారు. మాట మీద నిలబడే చరిత్ర తమదని స్పష్టం చేశారు.
ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి, ఒకసారి మంత్రి పదవికి తమ నాయకుడు కేసీఆర్ చెబితే రాజీనామా చేసిన చరిత్ర తమకు, బీఆర్ఎస్కు పార్టీకి ఉన్నదని హరీశ్‌రావు తెలిపారు. చంద్రబాబు సంకల చొర్రి, రైఫిల్ పట్టుకుని తెలంగాణ ప్రజల మీదకు బయల్దేరిన చరిత్ర నీది అని మండిపడ్డారు. అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది అని అన్నారు. రుణమాఫీ చేసినా.. రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి రంకెలు వేస్తున్నారని మండిపడ్డారు. పంద్రాగస్టులోపు సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని, ఆరు గ్యారంటీల్లో ఉన్న 13 హామీలను సంపూర్ణంగా చేయండి.. నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆనాడు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద చెప్పానని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల కంటే, రైతుల కంటే నా పదవి ముఖ్యం కాదని చెప్పిన అని తెలిపారు. కానీ ఆరు గ్యారంటీల సంగతి పక్కన బెడితే రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయకుండా అడ్డంగా దొరికిపోయాడని అన్నారు. తాను అనుకున్నట్లుగానే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ రేవంత్ రెడ్డి పెట్టాడని విమర్శించారు. తన ఫెయిల్యూర్‌ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలుపెట్టారని అన్నారు.
అధికారం దక్కించుకోవడానికి మోసం, అధికారం నిలుపుకోవడానికి మోసం, నీ 8 నెలల ప్రయాణమంతా కూడా మోసాల చరిత్రనే అని హరీశ్‌రావు మండిపడ్డారు. మోసాలు తప్ప మాట మీద నిలబడ్డ చరిత్ర లేదని ఎద్దేవా చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు కింద 70వేల కోట్లను రైతులకు నగదు బదిలీ చేశామని తెలిపారు. రుణమాఫీ కింద 30వేల కోట్లను అందించామని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో లక్ష కోట్ల రూపాయాలను రైతులకు అందజేశామని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చాక ఉసూరుమనిపించారని అన్నారు. రైతులకు రైతు భరోసా అని, రైతు కూలీలకు, కౌలుదారులకు ఇస్తానని చెప్పి అందరికీ ఎగనామం పెట్టారని అన్నారు. రైతు బంధు ఎగ్గొట్టి.. ఆ పైసలును రుణమాఫీకి డైవర్ట్ చేసి.. దాన్ని కూడా తూతూ మంత్రం చేశారని విమర్శించారు.
నిజంగా రుణమాఫీ చేస్తే శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో అప్పులు తీసుకున్న రైతులు ఎంతమంది? రుణమాఫీ ఎందరికీ అయ్యింది? ఎంత డబ్బు రైతుల ఖాతాలోకి డబ్బు బదిలీ అయ్యింది? ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యింది? ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అసెంబ్లీలో నీటి పారుదల, అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినట్లే.. రుణమాఫీపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరని ప్రశ్నించారు. ఎన్నికల ముందు 40 వేల కోట్లు అని అన్నారని.. కేబినెట్లో 31 వేల కోట్లు అని అన్నారని.. చేసిందేమో 17వేల కోట్లు అని మండిపడ్డారు. ఈ 17వేల కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే అని అన్నారు. ఈ డబ్బు ఈరోజుకు కూడా రైతుల ఖాతాలోకి వెళ్లలేదని చెప్పారు. ఆధార్ కార్డు-పాస్‌బుక్ మ్యాచ్ కాలేదని, రేషన్ కార్డు లేదనే కారణాలతో 17వేల కోట్లలో కూడా చాలామంది డబ్బు వెనక్కి వచ్చిందని అన్నారు.