Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడారని.. పిచ్చి ప్రేలాపనలు పేలాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్చగా తరలించుకపోతుంటే ఆపడం చేతగాక, నీ చేతగాని తనని గుర్తు చేసిన మా మీద రంకెలేస్తున్నావని తెలిపారు. పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్‌లతో అనునిత్యం అంటకాగి పాలమూరుకు తీరని ద్రోహం చేసింది నువ్వే అని రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. పాలు తాగి రొమ్ము గుద్దిన చరిత్ర నీది.. అది చరిత్ర చెపుతున్న సత్యమని అన్నారు.
పాలమూరును దత్తత తీసుకున్న అని చెబుతూనే పడావు పెట్టిండు నీ గురువు చంద్రబాబు అని రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు విమర్శించారు. ఆ చంద్రబాబుకు పాద సేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలను కాలరాచిన నీ పాపమే పాలమూరుకు శాపమైందని అన్నారు. ఆనాడు తెలంగాణలో ఓట్లడిగే మొఖం చెల్లక మా పొత్తు కోసం జోలె పట్టింది నువ్వు.. ఇప్పటికీ నెత్తికెత్తుకునే నీ ప్రియమైన తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి, పాలమూరు ప్రజల బతుకుల్లో నిప్పులు పోసింది కాంగ్రెస్ అని అన్నారు.
పాలమూరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్, టీడీపీలది అయితే.. ఆ రెండు పార్టీల్లో ఉన్న రేవంత్ రెడ్డికి ఆ రెండు పాపాల్లో వాటా ఉందని హరీశ్‌రావు విమర్శించారు. పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతామన్నందుకే కదా నీ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని తెలిపారు. నదీ జలాల్లో మీ కాంగ్రెస్ చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగానే ఆనాడు 40 రోజులు పాటు అసెంబ్లీని స్థంభింపజేశామని అన్నారు. నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారుతుందా? నీ వక్రబుద్ధి ప్రజలకు తెలియకుండా పోతుందా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నీళ్లు తరలిస్తుంటే హారతులు ఇచ్చింది.. వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి ఊడిగం చేసింది కాంగ్రెస్ నేతలనే చరిత్ర మరచి రేవంత్ మాట్లాడటం గురివింద సామెత ను గుర్తు చేస్తోందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు ఊడిగం చేసినా.. ప్రధాని మోదీకి భయపడి బడే భాయ్ అన్నా అది రేవంత్ లాంటి ఊసరవెల్లికే సాధ్యమని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి నీటి విలువ తెలియదు.. నోటి విలువ తెలియదు.. తెలిసింది ఒక్క అవినీతి నోట్ల విలువ మాత్రమే అని అన్నారు. రేవంత్ నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడకు, నువ్విప్పుడు బాధ్యత గల ముఖ్యమంత్రివనే విషయం మరచిపోవద్దని హెచ్చరించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డుపడుతూ కేసులు వేయించిన ఘాతకుడివి నువ్వే అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఎదుర్కొని 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన 10 శాతం పనులు చేయకుండా కావాలని పండపెట్టి పాలమూరు ప్రజల ఉసురు పోసుకుంటున్న ఊసరవెల్లివి నువ్వు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తే జనం కేసీఆర్ పేరుని తలుచుకుంటరనే కుళ్ళు బుద్ధితోని కావాలనే ప్రాజెక్టు పనులను పండబెట్టినవని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే కొడంగల్ నారాయణపేటకు కూడా నీళ్లు వస్తాయని.. కేవలం మీ స్వార్థం కోసం, కమిషన్ల కోసం నారాయణపేట ఎత్తిపోతల పథకాన్నీ తెరమీదకు తెచ్చావని విమర్శించారు. నీ దరిద్రపు కాంగ్రెస్ రాకుంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి నారాయణపేట కొడంగల్ రైతుల కాళ్లు కడిగేవాళ్లమని అన్నారు. నిన్ను ఎన్నుకున్న ఖర్మానికి పాలమూరు ప్రజలకు నీటి కటకట మొదలైందని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్, వలస బోయిన వాళ్లను వాపస్ తెచ్చింది కేసీఆర్ అని హరీశ్‌రావు తెలిపారు. మీ పాలనలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్ అని పేర్కొన్నారు. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27వేల ఎకరాలే సాగైతే, ప్రాజెక్టుల పనులు పూర్తిచేసి దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్ అని చెప్పారు. జూరాలకు సంబంధించి కర్ణాటకలో ఉన్న సబ్మర్జెన్స్ కాంపెన్సేషన్ చెల్లించి పూర్తిస్థాయిలో నీటిని నింపి లక్ష ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరు అందించింది కేసీఆర్ అని స్పష్టంచేశారు. ఆర్డీఎస్ కింద మీ దరిద్ర బోర్డు పాలనలో 30 నుంచి 35 వేల ఎకరాలకు మించి ఎన్నడూ సాగయ్యేది కాదని విమర్శించారు. మేం తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తి చేసి రాజోలి బండ పూర్తి ఆయకట్టుకు నీళ్ళు అందించామని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసి మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరులో నీళ్లు అందించిన ఘనత తమదని చెప్పారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తికాగానే మరో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ చేసిన కృషితోనే రాష్ట్రంలో అత్యధికంగా సాగునీటి వసతి కలిగిన సస్యశ్యామల జిల్లాగా పాలమూరు మారుతుందని పేర్కొన్నారు. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని అర్బకుడివి నువ్వు కేసీఆర్ మీద రంకెలేస్తావా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అని విమర్శించారు. ఉత్త వాగుడే తప్ప ఒక్క వాగు మీద కూడా ఒక్క ఇటుక పెట్టని ఒక్క చెక్ డ్యాం కూడా వదరుబోతువు నువ్వు అని అన్నారు.14 నెలల్లో ఒక్క చెక్ డాం కూడా కట్టని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడుతావా అని ప్రశ్నించారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ.. చేతగాని రేవంత్ రెడ్డికి కోతలెక్కువ అని ఎద్దేవా చేశారు.
నీ పనికిమాలిన పద్నాలుగు నెలల పాలన మీద చర్చకు నేను సిద్ధం.. నీ సవాలను స్వీకరిస్తున్నా.. అని హరీశ్‌రావు సవాలు విసిరారు. ఏ రోజు చర్చ చేద్దాం, ఎక్కడ చర్చ చేద్దాం నువ్వే చెప్పు అని డిమాండ్ చేశారు. నువ్వు చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి వస్తా అని అన్నారు. నీ కొడంగల్ నియోజకవర్గమైన సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తా అని చెప్పారు. నీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో పాటు, రుణమాఫీ సంగతి, రైతుబంధు సంగతి, మహాలక్ష్మి పథకం సంగతి, పెంచాల్సిన పెన్షన్ల సంగతి, నిరుద్యోగ భృతి సంగతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏల సంగతి, పెన్షనర్లకు ఇవ్వని పెన్షన్ బెనిఫిట్ల సంగతి సకలం చర్చిస్తా అని అన్నారు. నీ పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతా అని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి కుసంస్కారి కనుకే కేసీఆర్‌పై కక్ష పూరిత ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. దవడలు పగలగొట్టాల్సివస్తే అన్నింటా దగా చేసి ఏపీ కృష్ణా జలాల దోపిడీని నిలువరించలేకపోతున్న .. నీ దవడనే పగలగొట్టాలని విమర్శించారు. అరుపులు, పెడబొబ్బలతో రాష్ట్ర సాగు తాగు నీళ్ల కష్టాలు తీర్చలేవు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. నిందలు వేయడం మాని నదీజలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని సూచించారు. కడుపులో విషం పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలతో పాలన చేస్తే ఫలితాలు రావని అన్నారు. అబద్ధాల కోసం అజ్ఞానిలా నీ బుర్రను వాడే బదులు పది మందికి ఉపయోగపడేలా పాలన అందించడానికి ప్రయత్నించు అని సూచించారు.