Gosula Srinivas Yadav | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది అంతా అవినీతి సామ్రాజ్యం అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏమీ లేదని తెలిపారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు వాడకూడదని సూచించారు.
చట్టాలు తెలియని పొంగులేటి మంత్రి కావడం తెలంగాణ దౌర్భాగ్యమని గోసుల శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పేదల అసైన్డ్ భూములను కబ్జా చేసిన ట్రాక్ రికార్డ్ పొంగులేటిది అని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రోను నిలబెట్టి, పరుగెత్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. మెట్రోను అప్పుల ఊబిలో ముంచి, ఆ భారాన్ని తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దింది కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు అంటూ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.
లగచర్లలో రైతుల భూములు లాక్కుంటూ, మరోవైపు మూసీని బాగు చేస్తామని అంటున్నారని గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ నేతలంతా జైల్లో ఊసలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. పొంగులేటి ప్రదర్శిస్తున్న మేకపోతు గాంభీర్యం ఎంతో కాలం సాగదని అన్నారు. ప్రజా ఆగ్రహంతో కాంగ్రెస్ గల్లంతు కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.