హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 : హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గంధంగూడ పరిధి మూసీ పరీవాహక విఘ్నేశ్వరకాలనీ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం పటాకులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కొమ్ము కాస్తూ నిరుపేద ప్రజలను రోడ్డు పాలు చేసిన అధికారిని తప్పించిందని బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
హైడ్రాను అడ్డుపెట్టుకొని వందలాది ఎకరాల భూములను పక్కదారి పట్టించే కుట్ర చేశారని ఆరోపించారు. పెద్దలను కాపాడుతూ పేదల గూడును చెరిపేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరిచి హైడ్రా పేరిట పేదల జోలికి రావొద్దని హితవు పలికారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని, రంగనాథ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. పేదల జోలికొస్తే అధికారులకైనా.. ప్రజాప్రతినిధులకైనా ఇదే గతి పడుతుందని స్పష్టంచేశారు.