గుమ్మడిదల, జూలై 27: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలోని ఎర్రచెరువును పరిరక్షించాలని గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్‌గౌడ్, వైస్ చైర్ పర్సన్ చిమ్ముల సంధ్యారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కౌన్సిలర్లతో కలిసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారు బైఠాయించి ఆందోళనకు దిగారు. టీజీఐఐసీ నుంచి ఎర్రచెరువును రక్షించాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రచెరువుకు వరద రాకుండా కట్టుకాల్వలు ఆక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీజీఐఐసీ ద్వారా 109 సర్వే నంబర్ ప్రభుత్వభూమిని కొన్నినెలల క్రితం ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకున్నారన్నారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకున్న 109 సర్వే నంబర్భూమి మీదుగా వానకాలంలో వచ్చే వరద వల్ల ఎర్రచెరువు నిండుతుందన్నారు. చెరువు కింది పంట పొలాలకు సాగునీరు అందుతుందన్నారు. వందల మంది రైతులు ఎర్రచెరువును నమ్ముకుని వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కట్టుకాల్వలను పూడ్చివేసి వరద రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీఐఐసీ, ఇరిగేషన్, జిల్లా అధికారులు స్పందించి ఎర్రచెరువు కట్టుకాల్వలను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆందోళన వద్దకు తహసీల్దార్ పరమేశం వచ్చి ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలియజేసి ఎర్రచెరువు కట్టు కాల్వలను పరిరక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కౌన్సిలర్లు మూడు చింతల నరేందర్‌రెడ్డి, ఆకుల మాధవి, కత్తుల రమేశ్, మేడిపల్లి మురళి, బెంబడి సంజీవరెడ్డి, సురభి కుమార్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, ఆర్ల కిషన్, నాయకులు వెంకట్రామిరెడ్డి, మహ్మద్ హుస్సేన్, ఆంజనేయులు యాదవ్, మద్ది శేఖర్‌రెడ్డి, సూర్యనారాయణ పాల్గొన్నారు.