హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు బీసీ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చిందని, వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. బీసీల సంఖ్యరీత్యా 55 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉన్నదని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సివిల్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం, వైన్స్‌లో గౌడ కులస్థులకు 23 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారని, ఇప్పుడు ఆ ఊసే లేదని మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని గట్టు హెచ్చరించారు.