హైదరాబాద్, మే 8 (నమస్తేతెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు విమర్శించారు. పరస్పరం పొగడ్తలు కురిపించుకోవడం, కలిసికట్టుగా దాడులకు పాల్పడటం రెండు పార్టీలకు రివాజుగా మారిందని దుయ్యబట్టారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి గ్రూపు ఎక్కడికక్కడ అరాచకాలు సృష్టిస్తున్నదని ఆరోపించారు. భూమితోపాటు సహజ వనరులను కొల్లగొడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు అలవిగానీ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రైతుభరోసా ఇవ్వడం, రుణమాఫీ చేయడంలో దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. గతంలో ఏపీకి వచ్చిన ప్రధాని మోదీ తట్టెడు మట్టి ఇచ్చి వెళ్లారని, కానీ తెలంగాణకు ఆ మట్టి కూడా ఇచ్చే పరిస్థితిలేదని దెప్పిపొడిచారు. ఆయన రాకతో తెలంగాణ ప్రజానీకానికి ఒరిగేదేమీ ఉండదని దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరిచి ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. . కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో విలసిల్లిన తెలంగాణ.. కాంగ్రెస్ వచ్చాక దోపిడీలు, దౌర్జన్యాలకు నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి మాత్రం చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే శాంతిభద్రతలు అదుపుతప్పి పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదమున్నదని హెచ్చరించారు.