హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఆదివారం తిరుమలగిరిలో ఎంపీ చామల అనుచరుడు పర్రపాటి యుగంధర్ సామేల్ వ్యవహారంపై మీడియాతో మాట్లాడి బయటకు వస్తుండగా సామేల్ అనుచరులు అతడిపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. అతడితోపాటు కందుకూరు అంబేద్కర్పైనా దాడి చేసినట్టు తెలిసింది. ‘ఇది నా నియోజకవర్గం.. ఇక్కడ ఎవరూ అడుగుపెట్టేందుకు వీలు లేదు’ అని ఇటీవల సామేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విభేదాలకు దారితీశాయి. దాడి అనంతరం ఎంపీ అనుచరుడు యుగంధర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు తమను చంపాలని చూశారని ఆరోపించారు. ఇక్కడ తాము రాజకీయాలు చేయొద్దా? పార్టీలో ఉండొద్దా? అని ప్రశ్నించారు. తుంగతుర్తిలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరులను లేకుండా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మందుల సామేల్తోపాటు అతని అనుచరులపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని యుగంధర్ కోరారు.