హైదరాబాద్, జనవరి 27 (నమస్తేతెలంగాణ): అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. 400 రోజులు దాటినా ఎందుకు అమలు చేయడంలేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. పొద్దున లేస్తే పచ్చి అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ నాయకులు తమ నోళ్లను ఫినాయిల్‌తో కడుక్కొని శుద్ధిచేసుకోవాలని, ఇందుకోసం గాంధీభవన్‌కు తామే ఫినాయిల్ బాటిళ్లను కొరియర్ ద్వారా పంపుతున్నానమని చెప్పారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజుయాదవ్, వాసుదేవారెడ్డి, శుభప్రద్ పటేల్, గోసుల శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. 13 నెలల కాంగ్రెస్ పాలనలో నిరుపేదలకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
12 గంటల్లో రైతుల ఖాతాల్లో రైతుభరోసా నగదు వేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి 24 గంటల్లో ఎంతమంది రైతులకు నగదు అందించారో చెప్పాలని ప్రశ్నించారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ సర్కారు కాలం వెళ్లదీస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని, విలువలతో కూడన రాజకీయాలు చేయాలని హితవు పలికారు. లేదంటే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.