హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అంటేనే బోగస్ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి..రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ చేశాం హరీశ్‌రావు రాజీనామా ఏమైందని మరోసారి ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. రుణమాఫీతోపాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే ఇప్పటికీ రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని మరోసారి అబద్ధాలు మాట్లాడుతున్నారని, దీనికి నిరుద్యోగులే సమాధానం చెపుతారని అన్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో వరికి రూ.500 బోనస్ అని ఉందని, ఎక్కడా సన్నవడ్లకు బోనస్ అనిలేదని మ్యానిఫెస్టోను చూపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఎమర్జెన్సీ పాలన సాగుతుందని ఆరోపించారు. అధికారపార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని, ఇది సర్కారు వైఫల్యమేనని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని, పాలన చేతకాకుంటే దిగిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు, అవాంఛనీయ సంఘటనలు జరిగితే సహించేలేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్‌రెడ్డి, గోసుల శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.