హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వలేదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ దగుల్బాజీ మాటలు మాట్లాడడం దుర్మార్గమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. నాడు ఓట్లు దండుకునేందుకు ప్రియాంకగాంధీ, రేవంత్‌రెడ్డి సమక్షంలో విడుదల చేసిన యూత్ డిక్లరేషన్‌లోని ఫస్ట్ పేజీలో, ఫస్ట్ పాయింట్‌గా రాసిచ్చిన హామీని తుంగలో తొక్కడం ఎంతవరకు సమంజసమని నిగ్గదీశారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నాడు అధికారం కోసం రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు మాట మార్చడం శోచనీయమని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో పరీక్షలు పెట్టి, నియామకప్రక్రియను పూర్తిచేస్తే కాగితాలు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు 5 వేలు మాత్రమేనని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీపై మాటామార్చిన కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు యువత సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు.