హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజ లు బద్ధశత్రువుగా చూస్తారే తప్ప ఎప్పటికీ నమ్మరని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు. ప్రణాళిక లేకుండా, స్పష్టమైన దశాదిశ లేకుండా సీఎం గుడ్డిగా సాగుతున్నాడని విమర్శించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిపై సీఎంకు ప్రణాళిక లేదన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఎన్ని కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారో, ఎన్ని పెట్టుబడులు తెచ్చారో లెక్కలు చెప్పాలన్న మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇద్దరు మంత్రులు ఎదురుదాడి చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులతో పాటు, రెండేండ్లలో హామీల అమలు, ఇచ్చిన ఉద్యోగాలు? వంటి వాటిపైనా రేవంత్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌వి పచ్చి అబద్ధాలు
సీఎం రేవంత్ నోరు తెరిస్తే చాలు పొంతన లేని మాటలు, పచ్చి అబద్ధాలని ఎర్రోళ్ల విమర్శించారు. పెట్టుబడుల విషయంలో కూడా దావోస్ నుంచి గ్లోబల్ సమ్మిట్ వరకు అవాస్తవాలేనని దుయ్యబట్టారు. విద్యార్థులకు కడుపునిండా భోజ నం పెట్టడం చేతకాదు కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 వేల స్కూళ్లు ఎందుకు మూతపడ్డాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని మాటతప్పారని, ఓయూకు ఇస్తానన్న రూ.1,000 కోట్లపైనా దాటవేత ధోరణే అని మండిపడ్డారు.
విద్యార్థులు చనిపోయినా సమీక్ష నిర్వహించరా?
గురుకులాల్లో 116 మంది విద్యార్థులు చనిపోతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం ఎందుకు సమీక్ష చేయలేదని నిలదీశారు. అన్నీ ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడం కోసం చేస్తున్న ఎత్తులే తప్ప, విద్యార్థులపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఓయూలో పోలీసులు వద్దన్న ఆయనే ఇప్పుడు సభ లో పహారా ఎందుకు పెట్టుకున్నాడో చెప్పాలని నిలదీశారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైఫిల్ ఎక్కుపెట్టింది ఎవరూ మరువరు
రేవంత్ రెడ్డి ఓయూలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టుడే పనిగా పెట్టుకున్నాడని ఎర్రోళ్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు ఓయూకు వెళ్లినా తెలంగాణ ఉద్యమంపై రైఫిల్ ఎక్కు పెట్టిన తీరు విద్యార్థులెవ్వరూ మరిచిపోరని గుర్తుచేశారు. విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని చెప్పి, ఓయూ సమావేశంలో ‘మూడు రంగుల జెండా పట్టి’ అనే పాట ఎందుకు వినిపించారో చెప్పాలని నిలదీశారు. ఉద్యోగాల భర్తీ కోసం అశోక్‌నగర్‌లో రోడ్డెక్కిన విద్యార్థులపై లాఠీలు ఝులిపించింది కాంగ్రెస్ సర్కార్ కాదా అని నిలదీశారు.
పీఎం, సీఎం.. దొందూ దొందే..
ప్రధాని మోడీ మాజీ ప్రధాని నెహ్రూను విమర్శిస్తే, సీఎం రేవంత్‌రెడ్డి గత సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ దొందూదొందే అన్నట్టుగా నడుచుకుంటున్నాడని ఎర్రోళ్ల ఫైర్ అయ్యారు. గ్లోబల్ సమ్మిట్‌లో కాంగ్రెస్ నాయకులకు కోట్లు వేసి కూర్చోబెట్టి, విందులు, వినోదాలతో అలరించడమే చేశాడు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, ఇప్పటికైనా ప్రజలకేం కావాలో తెలుసుకుని మసలుకోవాలని సీఎంకు హితవు పలికారు. రాష్ట్రంలో రైతులు, ఆటోడ్రైవర్లు, విద్యార్థులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, బిల్డర్లతో పాటు రిజర్వేషన్ల కోసం బీసీ విద్యార్థులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనిపించడం లేదా అని దుయ్యబట్టారు. పట్టపగలు, నడిరోడ్లమీదనే మర్డర్లు, లైంగికదాడులు జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని తూర్పారా పట్టారు. కేసీఆర్ చదువుపైనా రాజకీయం చేస్తున్న రేవంత్, మరీ అధినేత రాహుల్, ప్రియాంక ఎక్కడ చదివారో చెప్పాలని ఎర్రోళ్ల ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ యువత అభిలాష్రంగినేని, దీపక్‌రెడ్డి, నాగరాజుయాదవ్, శ్రీకాంత్ ముదిరాజ్, మోహన్‌నాయక్ పాల్గొన్నారు.