హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): భక్తులు ఎంతో పరమభక్తితో వేములవాడ రాజన్నకు సమర్పించిన కోడెలను కోతకు అమ్ముకోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వం, మంత్రులు ఆఖరికి దేవుడి సొమ్మును కూడా దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఒక సొసైటీకి 60 కోడెలను ఇవ్వాలని ఆదేశాలిచ్చారని, మంత్రే కబేళాలకు తరలించడానికి సహకరించినట్టు స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ ఆదేశాల కాపీని మీడియాకు చూపించారు. సురేఖ చేసిన ఈ పాపం కాశీకి పోయినా పోదని, దొంగలకు సద్దులు మోస్తూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు.
తక్షణమే ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, లేదా నైతిక బాధ్యత వహిస్తూ ఆమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న కోడెల తరలింపుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. దేవుడి మీద ఒట్లు, దేవుడి సంపదకు తూట్లు ఇది కాంగ్రెస్ పార్టీ విధానంగా మారిందని ధ్వజమెత్తారు. గొప్పగా బాగు చేయకున్నా, వరంగల్ ఇజ్జత్ మాత్రం తీయవద్దని మంత్రికి హితవు పలికారు. వేములవాడలో కోడెను ఇస్తే కొండా సురేఖకు పోతయట కదా.. అనే నానుడి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ విజయోత్సవ సభకు రాజన్న సొమ్మును రూ.2 కోట్లు వాడుకున్న ఘటనపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.