కరీంనగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే నీళ్లు ఎలా ఎత్తిపోస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిందని, రూ.లక్ష కోట్లు గంగలో పోశారని, ఆ నీటితో ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్ర భుత్వం చేస్తున్న గ్లోబల్ ప్రచారానికి అడ్డుకట్టవేసి.. వాస్తవాలను ప్రజల ముందుంచాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల కాళేశ్వరం ప్రాజెక్టు స్టడీ టూర్ శనివారం సాయంత్రంతో ముగిసింది.
మేడిగడ్డ బరాజ్ నుంచి గంధమల్ల రిజర్వాయర్ వరకు క్షేత్రస్థాయి పర్యటన చేసిన ఎనిమిది మంది సభ్యుల బృందం.. కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం, తద్వా రా నదులకు నడకనేర్పిన కేసీఆర్ దార్శనికత.. దాని వెనుక ఉన్న నాటి బీఆర్ఎస్ సర్కారు విజన్, కాంగ్రెస్ సర్కార్ అవలంబిస్తున్న విధానాల వల్ల తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై స్టడీ టూర్ సాగించారు. ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని చేస్తున్న మీ ప్రచారం నిజమైతే ఇప్పుడు నీటిని ఎలా ఎత్తిపోస్తున్నారు?’ ఇప్పుడు మీ ప్రభుత్వం ఎత్తిపోస్తున్నది కేసీఆర్ ఏర్పాటుచేసిన పంపుహౌస్‌ల ద్వారా కాదా?. కేసీఆర్ కట్టిన రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయడం లేదా? వీటికి ముందుగా సమాధానం చెప్పాలి’ అని రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మోర్తాడ్, ఆగస్టు 30: సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలే స్వయంగా తిప్పికొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని చేస్తున్న తప్పుడు వాదనలకు ఫ్లెక్సీల రూపంలో సమాధానమిస్తున్నారు.
‘ఇదిగో.. బాల్కొండలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు’ అంటూ బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు వేసి కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కల్గిస్తున్నా రు. ‘కాళేశ్వరం కొట్టుకుపోలేదు.. కూలిపోలేదు. బాల్కొండ నియోజకవర్గంలో దీని తాలూకూ జరిగిన పనులు’ అని ముద్రించిన ఫ్లెక్సీలు పలు గ్రామాల్లో వెలిశాయి.