హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 బాధితులతో బంతాట ఆడుతున్నదని, అమాయక యువతను మోసగిస్తున్నదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఏడాదికాలంగా తమ హకుల కోసం కొట్లాడుతున్న జీవో 46 బాధితుల కేసు బుధవారం హైకోర్టులో విచారణకు రాగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది, అడ్వకేట్ జనరల్‌తో కావాలని కృత్రిమ కారణాలు చెప్పి వాయిదాకు కారణమైందని ఆరోపించారు. 20 సార్లకుపైగా కోర్టులో వాదనలు వాయిదా పడ్డాయని చెప్పారు. నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి కూడా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. తాత్కాలికంగా తప్పించుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని విచారణ వాయిదా పడాలని చూస్తున్నారని, చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది తప్పంటూ కోర్టు తీర్పు వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశా రు. జీవో 46 బాధితులకు న్యాయం జరిగే వరకూ బీఆర్ఎస్ తరఫున కొ ట్లాడుతామని స్పష్టంచేశారు. చట్టసభలు స్పందించకపోతే.. కోర్టులో కొ ట్లాడుతాం, కోర్టులో సమాధానం దొ రకకపోతే, ప్రజాకోర్టులో కొట్లాడుతామని చెప్పారు. జీవో 46పై ప్రభుత్వ వైఖరి చెప్పకపోతే ప్రజాఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
రేపు తెలంగాణ మట్టిబిడ్డ పీవీ జయంతి
తెలంగాణ మట్టిబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి వేడుకలను రేపు (శుక్రవారం) ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమిలో వేడుకలు కొనసాగనున్నాయి. ఉదయం 9గంటలకు పుష్పాంజలి, ప్రార్థనలు, భజనలు, సర్వమతప్రార్థనలు, అదేవిధంగా పీవీ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వైద్య, రక్తదాన శిబిరాలు, ఛాయాచిత్ర ప్రదర్శన, అన్నదాన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.