హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సోనియాగాంధీ తెలంగాణ తల్లి అయితే బలి దేవత ఎవరని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 9 ప్రకటనను వెనక్కి తీసుకోవడంతోనే వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి ఉందా ? అని ప్రశ్నించారు. ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి తనకు కాకపోయినా కుర్చీకి గౌరవం ఇవ్వాలని అడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారిక కార్యక్రమాల్లో సీఎం బజారు భాష మాట్లాడుతున్నారని, రేవంత్‌రెడ్డి స్పీచ్‌కు ముందు ‘ఓన్లీ అడల్ట్’ అని చెప్పి మీడియాలో ప్రసారం చేయాలని సూచించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం ఎవరితరమూకాదని, ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడని స్పష్టంచేశారు.