ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. 317 జీవోను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 317 జీవోపై వేసి కేబినెట్ సబ్ కమిటీ ఆరు నెలల తర్వాత ఇచ్చిన నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని అన్నారు. స్థానికత అంశాన్ని సబ్ కమిటీ పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ఈ నివేదికపై ఉద్యోగ సంఘాలు కూడా నిరసనలు తెలుపుతున్నాయని అన్నారు.
ఖాళీలను బట్టే ఉద్యోగుల బదిలీలు ఉంటాయని సబ్ కమిటీ నివేదికలో పేర్కొనడం హాస్యాస్పదమని దేవీ ప్రసాద్ అన్నారు. 317 జీవో బాధితులు సీఎంవో చుట్టూ తిరుగుతున్నా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. వెంటనే లోపాలను సరిదిద్ది 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి ఇచ్చిన ప్రకటన ఉద్యోగ నియామకాల పై బీఆర్ఎస్ చేస్తున్న వాదనను బలపరుస్తోందని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లే తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేసిందేమి లేదని అన్నారు.
ఉద్యోగుల డిమాండ్లను రేవంత్ ప్రభుత్వం ఏ ఒక్కటి నెరవేర్చలేదని దేవీప్రసాద్ విమర్శించారు. కనీసం రిటైర్ మెంట్ అయిన ఉద్యోగులకు వాళ్ళకు దక్కాల్సిన బెనిఫిట్స్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. మూడు వేల కోట్లకు పైగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. డీఏలు, పీఆర్సీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసేందేమీ లేదని విమర్శించారు. హెల్త్ కార్డుల ప్రస్తావనే లేదని.. చాలామంది ఉద్యోగులకు మొదటి తారీఖుకు జీతాలు రావడం లేదని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎవరు బద్నామ్ చేయడం లేదని.. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రజలే రోడ్ల పైకి వస్తున్నారని తెలిపారు
. మీరిచ్చిన హామీలను నెరవేర్చినా మేము ఆందోళన చేస్తే ప్రజలే మమ్మల్ని తప్పుబడుతారన్నారు. ప్రధాన ప్రతిపక్షం గా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై సంబురాలు చేస్తున్నారని.. రేవంత్ రెడ్డి ఏడాది తీసుకొచ్చింది ప్రజా పాలన కాదని.. పోలీసుల రాజ్యమని విమర్శించారు. నక్సలైట్లు ఉండాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్కౌంటర్లు చేయిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్ని నిర్బంధాలు పెట్టినా తాము నిద్రపోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.