Devi Prasad | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలకు ఏ ఒక్కరికీ కూడా ఇవాళ్టి వరకు జీతాలు అందలేదు. కిందిస్థాయి ఉద్యోగులకు జీతాలు అందేలా పని చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచిస్తున్నాం అని దేవీ ప్రసాద్ అన్నారు. తెలంగాణ భవన్లో దేవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
ఒకటో తారీఖునే జీతాలు వేస్తున్నాం అన్నారు, మీరు జీతాలు వేశాక కూడా ఆశ వర్కర్లు, అంగన్వాడిలు రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారా? రూ. 1500 నుంచి 9,750కు, రూ. 4000 నుంచి రూ. 13,850 వరకు ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు జీతాలు పెంచాం.. మీరు కూడా పెంచుతామని చెప్పారు. పెంచండి. మీరు జీతాలు పెంచినా కూడా ఆశాలు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారా..? అంగన్వాడీలకు జీతాలు ఒకటో తారీఖున ఇస్తే.. వారు బురద జల్లుతున్నారా..? వీటిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షంలో బాధ్యతయుతంగా ఉండి వ్యవహరిస్తున్నారు. అనేక సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నాం. పదేండ్లలో బీఆర్ఎస్ నాయకులు అందుబాటులో లేరు అని తప్పుడు ప్రచారం చేశారు, ఇప్పుడు మా పార్టీ వాళ్ళు గత పది రోజుల నుంచి చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ కోసం అడిగితే ఆమె కార్యాలయం నుంచి స్పందన లేదు.. ఇదేమీ పాలన.. ఇదేనా ప్రజా పాలన అనేది అర్థం కావడం లేదు. అధికారి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఎందుకు వస్తుంది. సీఎం రేవంత్ పర్మిషన్ తీసుకోవాల్నా..? ఒక అధికారే బీఆర్ఎస్ నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది… ఇలా ఉంటె సామాన్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఎలా కలుస్తారు? అని దేవీ ప్రసాద్ నిలదీశారు.