కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర నాయకులతో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను దాస్యం వినయ్ భాస్కర్ మంగళవారం కలిశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, రైల్వే డివిజన్ ఇతర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రైల్వే శాఖ మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..60 ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నం ఎలాగో, 40 ఏళ్ల కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల కల అని తెలిపారు.
నాడు ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీకి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వినతిపత్రాలు ఇచ్చామని దాస్యం వినయ్ భాస్కర్ గుర్తుచేశారు. నాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి పార్లమెంట్ సభ్యులు, మేము కలిసి విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేసిన విషయాన్ని తెలిపారు. న్యాయంగా కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ పలు రాష్ట్రాలకు తరలిపోయిన తీరును వివరించారు. వివిధ దశల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం వచ్చిన ఉద్యమ శక్తులతో కలిసి చేసిన పోరాటాన్ని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని సైతం కేసీఆర్ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని దాస్యం వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్ స్థాయికి త్వరితగతిన అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. కాజీపేట రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లు హాల్ట్ జరగాలని, ప్లాట్‌ఫామ్‌లు పెంచాలని, ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరారు. వరంగల్‌లో ఉన్న రైల్వే స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రజల అభిష్టాన్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ ఏర్పాటును సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కోరారు. 60 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్నారు. కాజీపేట ఐటీఐ కాలేజీ విద్యార్థులకు స్థానికంగా అప్రెంటిషిప్ కల్పించాలని కోరారు. చిరువ్యాపారులకు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని, బోడగుట్ట ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్మాణంలో ఉన్న ఫాతిమా బ్రిడ్జి త్వరగా పూర్తి అయ్యేలా రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే సమన్వయం, ఇతర సహకారం అందించాలని కోరారు.