Dasoju Sravan | కొండను తవ్వితే సీఎం రేవంత్ రెడ్డికి చివరకు ఎలుక కూడా దొరుకలేదు అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ అన్నారు. రాజ్ పాకాల తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి విందు చేసుకుంటుంటే, 300 మంది పోలీసులతో వాళ్ల ఇంటిపై దాడి చేసి, ఆ విందును రేవ్ పార్టీగా చిత్రీకరించడం, వాళ్లుంటున్న ఇంటిని ఫామ్హౌస్గా చూపించడం, పైగా ఆ విందును కేటీఆర్కు అంటగట్టడం రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.
డ్రగ్స్ అంటూ, రేవ్ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజా సమస్యలను అలాగే ప్రభుత్వ అవినీతిని మరుగున పెట్టేందుకు చిల్లర ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల కుటుంబసభ్యులను, వాళ్ల వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగుతూ, ముఖ్యమంత్రి హోదాను కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఇవే ప్రభుత్వ ప్రాధాన్యతలు అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండటం ఆయన కురుచ మనస్తత్వానికి, ఆయన నమ్ముకున్న చిల్లర రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
సందట్లో సడేమియా లెక్క కొంతమంది కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు అవివేకంతో కేటీఆర్, ఆయన కుటుంబసభ్యులపై పనికిరాని ఆరోపణలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ అన్నారు. పనికిరాని ఆరోపణలు చేస్తూ శునకానందం పొందుతున్నారని విమర్శించారు. చేతనైతే ప్రజా సమస్యలపై పోరాడండి.. కానీ కుటుంబసభ్యులను వీధుల్లోకి లాగి శిఖండి రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.