హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సునీల్ కనుగోలు కలిసి రాష్ర్టాన్ని అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి పరిపాలనపై ధ్యాస లేదని, ఆయనకు కేసీఆర్‌ను తిట్టడమే పని అని ఎద్దేవాచేశారు.
రాహుల్ గాంధీ గెలుపు కోసం వాయనాడ్‌లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయాల్సిన దుస్థితికి కాంగ్రెస్ దిగజారిందని దుయ్యబట్టారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని చెబుతూనే ఆయన కోసం రేవంత్ చేత ప్రచారం చేయించుకోవడం చూస్తేనే కాంగ్రెస్, రాహుల్ పరిస్థితి అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, ఎక్కడ అమలు చేశారో చూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని దాసోజు సవాల్ విసిరారు. ఢిల్లీకి కప్పం కట్టి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్న రేవంత్, సీఎం పదవిని కూడా అలానే తెచ్చుకున్నారని ఆరోపించారు.
ఢిల్లీకి డబ్బులు పంపడంపైనే రేవంత్ ధ్యాస ఉందని, పిచ్చి పట్టినట్లు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, మార్పు అంటే ఏమిటో ఓసారి చూద్దామని ప్రజలు ఆ పార్టీకి ఓట్లేశారని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రేవంత్‌రెడ్డి హూందాగా చూడడం లేదని, నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచాడని మండిపడ్డారు. సిగ్గూ శరం లేకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటెయ్యాలని అడుగుతున్నాడని ధ్వజమెత్తారు.
హామీలు ఒకటీ అమలు కాకున్నా, మరోసారి మోసం చేసేందుకు వస్తున్నాడని, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చెయకుండా కక్షగట్టి పంట పొలాలను ఎండబెట్టిన ఘనత రేవంత్‌రెడ్డిదేనని విమర్శించారు. ప్రజా దర్బార్ పేరుతో ఒక్కరోజే ప్రజాభవన్‌లో కూర్చొని దానిని నిర్వీర్యం చేశాడన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ దళారి అని, ప్రజలపై ఆయనకు ఎలాంటి ప్రేమ లేదని, ప్రజా సమస్యలపై అవగాహనే లేదన్నారు.
ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించుకున్నదని, ఆయన వయనాడ్‌లో రాహుల్ గాంధీని గెలిపించండి అని ప్రచారం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేరళ ప్రజలు తెలివైన వాళ్లని, ఎవరికి ఓటు వేయాలో వారికి బాగా తెలుసునన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వాళ్లకు తండ్రి లాంటోడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశాడని సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారని గుర్తుచేశారు. డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చే సంస్కృతి రేవంత్ రెడ్డిదని, ఎవరు డబ్బులిస్తే వారికి టికెట్లు అమ్ముకున్నాడని, అందుకే మాదిగలకు టికెట్ ఇవ్వలేదన్నారు.
మొదటి కేబినెట్లో ముదిరాజ్‌లకు మంత్రివర్గంలో ఎందుకు చోటివ్వలేదో చెప్పాలని, 14 ఎంపీ సీట్లు వస్తే ముదిరాజ్‌లకు మంత్రిపదవిస్తానని మరోసారి వారిని మోసం చేసేందుకు రేవంత్ సిద్ధమయ్యాడని దుయ్యబట్టారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం నుంచి ఒకరు కూడా వెళ్లి చూడలేదని, పాలమూరు బిడ్డలు ఒకసారి ఆలోచించాలని, 2014 కంటే ముందు పాలమూరు ఎలా ఉన్నది?, ఇప్పుడెలా ఉన్నది చూడాలని కోరారు. పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్ తెలంగాణను సాధించారని గుర్తుచేశారు.
‘కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కంచెలా కాపాడుకునుడేంది.. రేవంత్ రెడ్డీ.. నువ్వు ముఖ్యమంత్రివా?, గొర్రెల కాపరివా? సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే నీకు నమ్మకం లేదా?’ అని ప్రశ్నించారు. బీజేపీతో రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యాడని, ఆయన మోదీ ఏజెంట్ అని, ఏదో ఒక రోజు రేవంత్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు.
రేవంత్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేత లక్ష్మణ్, ఆ పార్టీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఇప్పటికి పది సార్లు అన్నారని, ఎంపీ అరవింద్ కూడా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడని బహిరంగంగానే వ్యాఖ్యానించారని, వాటిపై రేవంత్‌రెడ్డి ఇంత వరకూ స్పందించకపోవడం వెనుక అర్థమేమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాహుల్, మోదీ ఇద్దరికీ కన్ను కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద బట్టకాల్చి మీదేస్తే, కర్రు కాల్చి వాత పెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.