హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా తేకుండా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జి దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిషన్‌రెడ్డి మణిపూర్‌లో మంటలు రేగుతుంటే తెలంగాణలో చలికాగుతున్నారని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు రాజారాం యాదవ్, చలపతిరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు మోదీ సర్కారు తీరని అన్యాయం చేస్తుంటే కేంద్ర మంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రజాకార్ఫైల్స్ లాంటి సినిమాలతో మతం మంటలు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నదని, అందుకు మణిపూర్‌లో జరుగుతున్న దురాగతాలే నిదర్శనమని పేర్కొన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండను పట్టించుకోకుండా కిషన్‌రెడ్డి కుంభకర్ణ నిద్రపోతున్నాడని విమర్శించారు. బీజేపీ రాక్షస పాలనకు ఇంతకన్నా దుర్మార్గం ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఇండ్ల నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నయాపైసా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కిషన్‌రెడ్డికి లేదని స్పష్టం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం
బీజేపీ, కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని శ్రవణ్ విమర్శించారు. తెలంగాణకు లక్షల కోట్లు తెచ్చామంటున్న కిషన్‌రెడ్డి అసత్యాలపై కాంగ్రెస్ ఎంపీలు మౌనం వహించడం.. బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు సీఎం కేసీఆర్‌పై ఆ రెండు పార్టీలు పలు సందర్భాల్లో ఆరోపణలు చేయడం బీజేపీ, కాంగ్రెస్‌ల చీకటి ఒప్పందానికి నిదర్శనమని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలే సీఎం కేసీఆర్‌కు పరమావధి అని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందని, తెలంగాణ మాడల్‌ను మున్ముందు దేశమంతటా అమలుచేస్తే తమకు పుట్టగతులు ఉండవన్న అక్కసుతోనే సీఎం కేసీఆర్‌పై బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
సంక్షేమ పథకాలపై చర్చిద్దామా?
తెలంగాణలో, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై, ప్రత్యేకించి ఆసరా పింఛన్లపై బహిరంగ చర్చకు కిషన్‌రెడ్డి సిద్ధమా? అంటూ శ్రవణ్ సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కోరినా, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు కోసం ఆందోళనలు చేస్తున్నా మోదీ సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించిన మోదీ సర్కారు గత పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించిందా? అని శ్రవణ్ ప్రశ్నించారు.