Dasoju Sravan | కేసీఆర్ మొక్క కాదు.. ఓ ఉద్యమ వృక్షం.. ప్రజల కల్పవృక్షం అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి తులసీవనంలో గంజాయి మొక్కలా మారారని విమర్శించారు. మహారాష్ట్ర ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పదవి ఊడటం ఖాయమని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ అదానీతో కలిసి పోయారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పదవి ప్రమాదంలో పడిందని, అందుకే ఈ అసహనమని దాసోజు శ్రవణ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ స్టార్‌గా, పరేషాన్ రెడ్డిగా మారి కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు పెన్షన్లు పెంచలేనోడు, తులం బంగారం ఇవ్వలేనోడు.. కోటి మందిని కోటీశ్వరులను చేస్తాననడం.. పుండుకు సమరు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. సోనియా కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటానని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. ‘నీ లాంటి చిచోరా వ్యక్తికి సీఎం పదవి ఇచ్చినందుకు సోనియా కాళ్లు కడిగిన నీటిని తీర్థం తాగినట్టు తాగినా తప్పు లేదు’ అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట శాపంలా మారారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. రేవంత్ రాజకీయాలను చిల్లర మల్లరగా మార్చారని ధ్వజమెత్తారు. తొక్కుతా, చంపుతా, పీకుతా.. పేగులు మెడలు వేసుకుంటా అని సీఎం పదవిలో ఉండి ఎవరైనా మాట్లాడతారా అని నిలదీశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసే వాళ్లు మాట్లాడే మాటలేనా ఇవి అని ప్రశ్నించారు. కేవలం పిచ్చి పట్టిన వాళ్లే రేవంత్‌లా మాట్లాడతారని మండిపడ్డారు. రేవంత్ భాషను మంత్రి వర్గంలో ఉన్న ఉత్తమ్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ లాంటి వాళ్లు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌తో రేవంత్ అభివృద్ధిలో పోటీ పడాలి, తలసరి ఆదాయం పెంచడంలో పోటీపడాలని అని సూచించారు. ‘రేవంత్.. దమ్ముంటే రాష్ట్రంలో బెల్ట్ షాపులు బంద్చేయి. నీ ఫొటోకు పాలాభిషేకం చేస్తా. నీకు బహిరంగంగా దండం పెడతా’ అని సవాలు విసిరారు. కేసీఆర్‌పై దూషణల మీద పెట్టే శ్రద్ధ పాలన మీద పెట్టు రేవంత్ అని హితవు పలికారు.