Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 9, (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అసందర్భంగా ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ పేరు ప్రస్తావించడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అటు ఇటు అయితే బీజేపీలో చేరడానికి ముందచూపుతో దస్తీ వేస్తున్నాడా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పూర్వాశ్రమంలో తనది కూడా బీజేపీ డీఎన్ఏ అని ఆ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా అసందర్భం అయినప్పటికీ ఆర్ఎస్సెస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ పుట్టు పూర్వోత్తరాలను గుర్తు చేశారా.. అని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం జరిగినప్పుడే ఆ పార్టీ సీనియర్ నేతలు, ఆరెస్సెస్‌కు సంబంధించిన వ్యక్తికి పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారని నిలదీసిన విషయం తెలిసిందే. అలాగే గాంధీభవన్‌లో గాడ్సే జోరబడ్డారన్న విమర్శలు కూడా వచ్చాయి.
ఇదే విషయాన్ని అప్పటి పంజాబ్ సీఎం అమరేందర్‌సింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతూ, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తిని నియమించారని ప్రస్తావిస్తూ పార్టీ విధానాన్ని తప్పుబడుతూ ట్వీట్ కూడా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. బుధవారం పార్లమెంట్లో బీజేపీ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశాస్వ తీర్మానంపై చర్చ సందర్భంగా రేవంత్‌రెడ్డి అసందర్భంగా హెగ్డేవార్ పేరు ప్రస్తావించారు. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్గేవార్ అని పూర్తి పేరును ప్రస్తావిస్తూ.. ఆయన పుట్టింది తెలంగాణలోనే అని గుర్తు చేశారు. సభలో జరిగే చర్చతో సంబంధం లేకపోయినా రేవంత్‌రెడ్డి ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారో తెలియక కాంగ్రెస్ సభ్యులతో పాటు బీజేపీ సభ్యులు కూడా విస్మయం చెందారు. బీజేపీకి ‘బీ’ టీమ్ అని బీఆర్ఎస్ను విమర్శించే కాంగ్రెస్ నాయకులకు ‘బీ’ ఎవరో రేవంత్‌రెడ్డి తెలిసి వచ్చేటట్టు చేసినట్టు అయిందని ఆ పార్టీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
రేవంత్ బీజేపీకి కోవర్టా?: దాసోజు
టీపీసీసీ చీఫ్ రేవంత్ కుటిల రాజకీయాలతో బీజేపీకి కోవర్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నారా.. అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ పేరును అసందర్భంగా రేవంత్ లోక్‌సభలో ప్రస్తావించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రాపకం కోసమే ఈ వ్యాఖ్యలు చేసినట్టుందని పేర్కొన్నారు. రేవంత్ తన కుట్రపూరిత పాత్రపై తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నిజమైన నేతలకు, క్యాడర్‌కు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.