సూర్యాపేట, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ)/నూతనకల్: కాంగ్రెస్ గూండాల దాడిలో మరో బీఆర్ఎస్ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే భయంతో కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి ఒడిగట్టారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నది. గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో బీఆర్ఎస్ బలపర్చిన మాదాసు వెంకన్న పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి దేశపంగు మురళి పోటీ చేశారు. గ్రామంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఎలాగైనా బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గూండాలు కుట్రలు పన్నారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్యయాదవ్, ఉప్పల మల్లయ్య (57), మున్న లింగయ్య ఇతర కార్యకర్తలతో కలిసి ఎన్నికల విషయాలను చర్చించేందుకు వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన ఉప్పల సతీశ్, కొరివి గంగయ్యతోపాటు సుమారు 70 మంది వరకు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నారు.
తమ వెంట తెచ్చుకున్న రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మున్న మల్లయ్యయాదవ్‌పై దాడి చేస్తుండగా అడ్డుకున్న ఉప్పల మల్లయ్య తలపై కర్రలతో దాడి చేయడంతో స్పృహతప్పి కింద పడిపోయాడు. అప్పటికీ వదలకుండా అక్కడే ఉన్న రాయితో ఉప్పల మల్లయ్య తలపై కాంగ్రెస్ గూండాలు గట్టిగా కొట్టడంతో మెదడు బయటకొచ్చింది. దీంతో అక్కడే ఉన్న కొందరు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలతో ఉన్న మల్లయ్యను సూర్యాపేటకు, అక్కడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్యను టార్గెట్ చేసుకొని ఈ దాడికి పాల్పడినట్టు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ దాడిలో మున్నా మల్లయ్యయాదవ్ సహా 15 మందికి గాయాలయ్యాయి. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మల్లయ్య భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు. గ్రామాన్ని ఏఎస్పీ రంగారెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ నర్సింహారావు సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.
8 మంది నిందితుల రిమాండ్
లింగంపల్లిలో ఉప్పల మల్లయ్యయాదవ్ హత్య కేసులో 8 మంది నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సూర్యాపేట ఏఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తగాదాతో జరిగిన దాడుల్లో ఉప్పల మల్లయ్యయాదవ్‌కు తీవ్రగాయాలు కాగా, బాధితుడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. దాడి కేసుకు సంబంధించి ఉప్పల సతీశ్, కొరివి గంగయ్య, వీరబోయిన సతీశ్, ఉప్పల గంగయ్య, ఉప్పల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

కాంగ్రెస్ గూండాయిజానికి పరాకాష్ఠ: జగదీశ్‌రెడ్డి
కాంగ్రెస్ గూండాయిజానికి బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య దారుణహత్య పరాకాష్ఠ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ రౌడీమూకల చేతిలో హత్యకు గురైన ఉప్పల మల్లయ్య మృతదేహానికి జగదీశ్‌రెడ్డితోపాటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఈ దశలో ప్రశ్నించిన వారిని, రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తూ, హత్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై జిల్లా పోలీసుల అసమర్థత, అధికార పార్టీ ప్రోత్సాహం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు, పోలీసుల తీరు మారకుంటే జనం తిరగబడతారని, అప్పుడు రాష్ట్రం రావణకాష్టంలా మారుతుందని హెచ్చరించారు.
ఆ పరిస్థితిని కొని తెచ్చుకోకముందే డీజీపీ స్పందించి పోలీసు వ్యవస్థను చక్కదిద్ది, కాంగ్రెస్ గూండాయిజాన్ని అణచివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ ప్రత్యర్థులను నిర్మూలించడమే పనిగా ఆ పార్టీ పెట్టుకున్నదని ఆరోపించారు. 6 నెలల క్రితమే మిర్యాలలో ఓ హత్య జరగ్గా ఆనాడే పోలీసులను హెచ్చరించానని, నాడు పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే లింగంపల్లిలో ఈ హత్య జరగకపోయేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
మంత్రుల అండదండలతోనే దాడులు
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రుల అండదండలతోనే దాడులు జరుగుతున్నాయని జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ నాయకుల్లా పనిచేస్తుండటంతో కాంగ్రెస్ నాయకులు పోలీసులతో కలిసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అనుచరుల ఆగడాలు మితిమీరుతున్నాయని, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కూడాఅదే పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. పోలీసులకు మొదటి నుంచి తాము చెప్తున్నామని, అయినా దాడులు చేసిన వారికే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, ఈ విషయంపై డీజీపీ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
హత్యా రాజకీయాలను సహించేది లేదు
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య దారుణహత్యను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డికి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు ఫోన్‌చేసి, హత్య వివరాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు.
ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అధికార దాహంతో కాంగ్రెస్ గూండాలు సాగిస్తున్న అరాచకాలను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త, నాయకుడికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.. ఎవరూ అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ గూండాల చేతిలో హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి, గాయపడిన నాయకులకు పార్టీ అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.