Balka Suman | జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపులు దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో చిన్న అవాంఛనీయ ఘటన జరగలేదని తెలిపారు. హైదరాబాద్‌లో బతుకుతున్న ప్రతి ఒక్కరూ హైదరాబాదీయులే అని.. వాళ్ల కాలికి ముళ్లు గుచ్చుకుంటే.. నా పంటితో తీస్తానని కేసీఆర్ సీఎం హోదాలో అన్నారని గుర్తుచేశారు. శాంతి భద్రతలు కఠినంగా అమలుచేశారని తెలిపారు. దీనివల్ల హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరించిందని అన్నారు. కేసీఆర్ పాలనలో పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం పెరిగిందని తెలిపారు. కేసీఆర్ పాలనలో పెట్టుబడులకు తెలంగాణ గేట్‌వే ఆఫ్ ఇండియాగా ఉంటే.. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ గన్ కల్చర్‌కు అడ్డగా మారిందని బాల్క సుమన్ విమర్శించారు.
జూబ్లీహిల్స్ అనేది సంగమం లాంటి నియోజకవర్గమని బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకోవాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. హైదరాబాద్ ప్రగతి తెలంగాణ పురోగతికి దోహదపడిందని అన్నారు. హైదరరాబాద్‌లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేసినందుకు .. 2018లో అత్యధిక సీట్లు వచ్చాయని తెలిపారు. రెండు సందర్భాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ కైవసం చేసుకుందని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో తిరోగమన దిశగా కొనసాగుతోందని బాల్క సుమన్ విమర్శించారు. వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని అన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగడం లేదని మండిపడ్డారు.ఆరు గ్యారంటీలు అన్నారని.. ఒక్క గ్యారంటీ కూడా అమలుకు నోచుకోలేదని తెలిపారు. రైతు డిక్లరేషన్ అన్నారని.. రైతులకు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. మంత్రివర్గం మొత్తం జూబ్లీహిల్స్‌లో దిగారని.. జూబ్లీహిల్స్‌ను రణరంగంగా మార్చేశారని అన్నారు. ఆడబిడ్డ కన్నీళ్లపై డ్రామా అని మంత్రులు మాట్లాడుతున్నారని.. గోపీనాథ్ కూతుళ్లు ప్రచారం చేస్తే వాళ్లపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.