Balka Suman | హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. అన్యాయంగా పేదల ఇళ్లను కూలుస్తున్నారని విమర్శించారు. హైడ్రా చర్యలతో పేదలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలపై కక్షకట్టినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆదివారం మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మంలో మున్నేరు వరద బాధితులను అడ్డుకున్నారని బాల్క సుమన్ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ ఖమ్మం ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. వర్షాలపై వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖమ్మంలో పర్యటిస్తే కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, వరద భాదితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఏ మేరకు నష్టపోయాయో అంచనా వేయాలన్నారు.