హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘సోనియమ్మ కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవడం కాదు.. ముందు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కాళ్లు కడిగి నెత్తిన పోసుకో రేవంత్‌రెడ్డీ’ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి చురకలంటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మహావృక్షమని, దాని కింద ఎదిగిన పిల్ల మొక రేవంత్ అని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లే కుండా చేస్తానన్న రేవంత్, చివరికి కేసీఆర్ ఆనవాళ్లనే ప్రారంభించేందుకు వరంగల్ వెళ్లారని గుర్తుచేశారు. అధికారం చేపట్టి ఏడాదైనా సందర్భంగా మొదట విజయోత్సవసభ అని, విజయాలు ఏమీ లేకపోవడంతో ఇందిర మహిళాశక్తి అని ఆఖరి నిమిషంలో సభ పేరు మార్చారని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ను తిట్టడానికి, కేటీఆర్, హరీశ్‌రావుల విమర్శలకు సమాధానాలు చెప్పేందుకే ఈ సభ పెట్టినట్టు ఉన్నదని దుయ్యబట్టారు. ‘ఇది ఆడబిడ్డల రాజ్యం అంటూ బడాయి మాటలు చెప్తున్నవ్. కానీ, లగచర్లలో గిరిజన ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హైడ్రా కూల్చివేతలతో ఆడబిడ్డల కన్నీళ్లకు ఎవరు కారణం?’ అని నిలదీశారు. ‘బీఆర్ఎస్ నీడలో ఎదిగిన పిల్లమొక్క రేవంత్‌రెడ్డి, మహావృక్షమైన కేసీఆర్‌ను మొలకెత్తనివ్వను అనడం హాస్యాస్పదంగా ఉన్నది’ అని బీఆర్ఎస్ నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్ గౌడ్ ఓ ప్రకటనలో విమర్శించారు. ప్రవర్తన ఇలాగే ఉంటే రేవంత్‌కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.