Rakesh Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కేవలం 100 కిలోమీటర్ల దూరానికే హెలికాప్టర్లు వినియోగిస్తూ కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న మంత్రులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపునకు తూట్లు పొడుస్తున్నారని బీఆర్ఎస్ నేత ఏ రాకేశ్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి తన ఢిల్లీ టూర్ కోసం రూ.300 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ వృథా ఖర్చును తగ్గించుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తీరిస్తే విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాల అవస్థలు తప్పేవి కదా అని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోతే కళాశాలల యాజమాన్యాలకు ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ‘కాలేజీ ఫర్ సేల్’ అని పలు విద్యాసంస్థల వద్ద బోర్డులు వేలాడుతున్నాయని తెలిపారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో డిగ్రీ పరీక్షలను వాయిదా వేసే పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు. యాజమాన్యాల చేతిలో డబ్బుల్లేక, సకాలంలో బిల్లులు చెల్లించలేదని విద్యుత్తు, మున్సిపల్ వాటర్ ఇతర సరఫరాలను తొలగిస్తున్నారని తెలిపారు. సిబ్బంది జీతాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితులు దాపురించాయని తెలిపారు.
ఫీజులు చెల్లిస్తారా? బంద్ పెడతారా?
రాష్ట్రంలో ఇప్పటికే రైతుబంద్ పథకాన్ని బంద్ పెట్టారని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా బంద్ పెడతారా? కొనసాగిస్తారా? అనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేని సీఎం రేవంత్రెడ్డి.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్కిల్డ్ యూనివర్సిటీల గురించి తరచూ మాట్లాడటం విడ్డూరమని పేర్కొన్నారు. వెంటనే ఫీజు బకాయిలు చెల్లించి, కాలేజీలకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.