హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ నిర్వహించిన కులగణన సర్వే నివేదికలో తప్పుల తడకపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు సాధనకు కార్యాచరణకు సిద్ధమవుతున్నది. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు సమాయత్తమవుతున్నది. ఈ దిశగా బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశమై కార్యాచరణను సిద్ధం చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు హైదరాబాద్లోని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నది.రాష్ట్రంలో బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు సాధనతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ కార్వనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు హాజరై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశానికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు, బీసీలకు ప్రకటించిన సంక్షేమ పథకాల సాధనకు పార్టీ చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేయనున్నారు.