హైడ్రా పేరిట పేదల గుడిసెలు, ఇండ్లు కూల్చి వారిని రోడ్డున పడేసిన దుర్మార్గపు పాలనకు రోజులు దగ్గర పడ్డయ్. రెండున్నరేండ్లలో సీఎం రేవంత్ నాలుగు లక్షల కోట్ల అప్పుచేసిండు. హైదరాబాద్‌లో ఒక ఇల్లు కట్టకుండా, ఒక పేదవాడితోనైనా గృహప్రవేశం చేయించకుండా అప్పుచేసిన సొమ్ము ఏం చేశారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలె.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా ప్రభుత్వం నడువడం లేదని, కేవలం మాఫియా మాత్రమే రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర నలుమూలలా ఎవరిని కదిలించినా కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండానేనని స్పష్టంచేశారు. ఏ ఎన్నికలొచ్చినా పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కథానాయకులై కదంతొకాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మలాజిగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని మలాజిగిరిలోనూ ప్రజలు మరోసారి బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇకడి సైబరాబాద్, మలాజిగిరి మున్సిపాలిటీలపై కూడా బీఆర్ఎస్ జెండా రెపరెపలాడటం ఖాయమని వెల్లడించారు. తెలంగాణకు మళ్లీ మంచిరోజులు రావాలన్నా, హైదరాబాద్ అభివృద్ధి పట్టాలపై పరుగులు పెట్టాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తించి ప్రజలు గుండెలనిండా ఆశీర్వదిస్తున్నారని చెప్పారు.

దశాబ్దాల పాటు తెలంగాణను పట్టి పీడించిన సమస్యలకు కేసీఆర్ పాలనలో అప్పుచేసిన ప్రతిపైసాతో శాశ్వత పరిషారం చూపారని కేటీఆర్ వివరించారు. లక్ష కోట్లతో కరెంట్ కష్టాలు తీర్చడంతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. 33 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకిందని చెప్పారు. హైదరాబాద్‌లో ఆరు దశాబ్దాల్లో ఒకటంటే ఒక కొత్త దవాఖానలు నిర్మించలేదని, కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నలుమూలలా కార్పొరేట్ హాస్పిటళ్లను తలదన్నేలా టిమ్స్ హాస్పిటళ్లు నిర్మించారని తెలిపారు. నాడు కేసీఆర్ శ్రీకారం చుట్టిన సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్ హాస్పిటళ్లే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నిర్మాణాలకు రిబ్బన్ కటింగ్ చేసేందుకు మాత్రమే ముఖ్యమంత్రి కత్తెర పట్టుకొని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే జీవో 58, 59 కింద రెండున్నర లక్షల మంది పేదలకు పట్టాలిచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి పేదల ఇండ్లు కూల్చుడు తప్ప, నిర్మాణాలు చేతకావని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెండున్నరేండ్లలో ఒక ఇటుక కూడా పేర్చకుండానే నాలుగు లక్షల కోట్ల అప్పుచేశాడని ధ్వజమెత్తారు. హైడ్రా పేరిట పేదల గుడిసెలు, ఇండ్లు కూల్చి వారిని రోడ్డున పడేసిన దుర్మార్గపు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఒక ఇల్లు కట్టకుండా, ఒక పేద వాడికి గృహప్రవేశం చేయించకుండా అప్పుచేసిన సొమ్ము ఏం చేశారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలకు కొండంత అండగా నిలిచిన రైతు బంధు కూడా బంద్ అయిందని, రాహుల్ బంధు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నదని ధ్వజమెత్తారు. విద్యార్థులు, మహిళలు, దళితులకు అనేక రకాల హామీలిచ్చి అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. కష్టపడి పండించిన పంటను కొనే దికులేక అవే ధాన్యం కుప్పలపై రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి, ముందుగా మహాలక్ష్మీ పథకాన్ని అమలుచేయాలని సవాల్ చేశారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఒక్కో మహిళకు బాకీపడ్డ 75 వేలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తది. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధ్వంసంతో వాస్తవాలన్నీ ప్రజలందరికీ అర్థమైపోయినయ్. కాంగ్రెసోళ్లు హామీలను గాలికొదిలేసి అన్ని రకాల దోపిడీకి తెగబడ్డరు. ఈ అరాచక పాలనకు చరమగీతం పాడేదాకా కార్యకర్తలంతా కలిసికట్టుగా పోరాడాలె.
-కేటీఆర్

హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ అసమర్థ పాలనను చూసి తిట్టుకోని రోజులేదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. అన్నం ఉడికిందా? లేదా? అని చెప్పడానికి ఒక్క మెతుకు చాలని, 30 నెలల్లో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పాడని, తులం బంగారం ఇస్తాం, రైతుభరోసా 15 వేలు చేస్తాం , పెన్షన్‌ను డబుల్ చేస్తామని అడ్డగోలు హామీలిచ్చారని దుయ్యబట్టారు. చివరికి అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల పేరిట చేసిన మోసం రెండున్నరేండల్లో పూర్తిగా బట్టబయలైందని మండిపడ్డారు. వంద రోజుల్లోనే అన్నీ హామీలు అమలు చేస్తామని చెప్పి, గ్యారెంటీ కార్డుకు కాంగ్రెస్ సరార్ పాతరేసిందని విమర్శించారు. గ్యారెంటీ కార్డును భద్రంగా పెట్టుకోవాలని చెప్పిన డిప్యూటీ సీఎం మాటలు నీటి మూటలయ్యాయని చెప్పారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తొమ్మిదిన్నరేండ్లపాటు అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగులు తీశాయని కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు ఎండకాలం వచ్చిందంటే కరెంట్ కష్టాలతో ప్రజలు అల్లాడిపోయేవారని గుర్తుచేశారు. అపార్ట్మెంట్లు, దుకాణాల వద్ద జనరేటర్ల మోత మోగేదని, ప్రజల జేబులు ఖాళీ అయ్యేవని గుర్తుచేశారు. పరిశ్రమలకు మూడు రోజుల పాటు పవర్ హాలిడేలు ప్రకటిస్తే, ఇందిరా పార్ వద్ద ధర్నాలు చేసిన దుస్థితి ఉండేదని చెప్పారు. కరెంట్, తాగునీటి కూడా తండ్లాట ఉండేదని, ఖైరతాబాద్‌లోని జలమండలి ఎదుట ఖాళీ బిందెలతో ప్రతినిత్యం ధర్నాలు, నిరసనలు హోరెత్తిపోయేవని గుర్తుచేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్టటిన ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కరెంట్ సమస్యను శాశ్వతంగా తీర్చారని, రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి అటు వ్యవసాయానికి, ఇటు గృహ అవసరాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకిందని తెలిపారు. హైదరాబాద్ వాసుల తాగునీటి కష్టాలు తీర్చి, ఏకంగా 25 వేల లీటర్ల వరకు ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీరు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తుచేశారు. సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని ఆవిషరించామని, రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ. 2000కు పెంచుకున్నామని, ఒక హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టామని తెలిపారు. మలాజిగిరిలోనే 3,500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చుకున్నామని చెప్పారు. 15 లక్షల మంది ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయల చొప్పున అందించి ఆదుకున్న మేనమామ కేసీఆర్ అని కొనియాడారు. ‘ట్రెయిలర్ చూస్తేనే సినిమా హిట్టో, ఫట్టో చెప్పే రోజులివి.. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సగం సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది’ అని దెప్పిపొడిచారు.
రెండున్నరేండ్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ఇటుక పేర్చకుండా నాలుగు లక్షల కోట్ల అప్పుచేసిండు. హైడ్రా పేరిట పేదల గుడిసెలు, ఇండ్లు కూల్చి వారిని రోడ్డున పడేసిన దుర్మార్గపు పాలనకు రోజులు దగ్గర పడ్డయ్. హైదరాబాద్‌లో ఒక ఇల్లు కట్టకుండా, ఒక పేద వాడికి గృహప్రవేశం చేయించకుండా అప్పుచేసిన సొమ్ము ఏం చేశారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలె.
-కేటీఆర్

మలాజిగిరిలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, గతంలో పార్టీ కార్యకర్తలను ముట్టుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా కలిసి అండగా నిలబడ్డామని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చా రు. ఎవరిపైనైనా అక్రమ కేసులు బనాయిస్తే దగ్గరుం డి వారిని విడిపించే దాకా పార్టీ నాయకత్వం పోరాడుతుందని భరోసానిచ్చారు. గులాబీ కార్యకర్తలం తా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
త్వరలో మొదలుకానున్న ఎస్ఐఆర్లో అర్హు ల ఓట్లు తొలగించకుండా బూత్ లెవల్ ఏజెం ట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. 18 ఏండ్లు నిండిన కొత్త ఓటర్లను చేర్పించాలని చెప్పారు. బీజేపీ తమవి కావు అనుకున్న ఓట్లను కావాలనే తొలగిస్తున్నదనే అనుమానం వ్యక్తంచేశారు. ఒక బెంగాల్లోనే 90 లక్షలకు పైగా ఓట్లను కావాలని తొలగించినట్టు టీఎంసీ నేతలు ఆరోపించారని గుర్తుచేశారు. మలాజిగిరిలో అర్హులైన వారిలో ఒక ఓటు కూడా పోకుండా చూసుకునే బాధ్యత బూత్ లెవల్ కార్యకర్తలదేనని తెలిపారు.
480 బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ బాధ్యత తీసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో ప్రతి బూత్‌లో గులాబీ పార్టీకి మెజారిటీ సాధించడమే లక్ష్యం గా అకుంఠిత దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును డిజిటల్ రూపంలో చేపట్టేందుకు మెంబర్ షిప్ యాప్ ను కూడా తీసుకువస్తున్నామని తెలిపారు. అత్యంత సులభంగా మెంబర్ షిప్ ప్రక్రియ చేపట్టేలా యాప్‌ను రూపొందించామని పేరొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రతి ఒకరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.