BRS | హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగుతుంది.. కేసీఆర్ సారథ్యంలోని గులాబీ పార్టీ హ్యాట్రిక్ విజయంతో రికార్డు సృష్టిస్తుంది. ఇటీవల విడుదలైన ప్రముఖ సర్వేలన్నీ ఘంటాపథంగా చెప్తున్నదిదే. ఇండియా టీవీ, ఫ్యాక్ట్ మార్కెటింగ్ సంస్థ, మిషన్ చాణక్య సర్వేలు బీఆర్ఎస్కే విజయావకాశాలున్నాయని స్పష్టం చేయగా.. తాజాగా నేషనల్ సెఫాలజీ ఇన్స్టిట్యూట్ (ఎన్పీఐ) నిర్వహించిన ఒపీనియన్ పోల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తున్నట్టు వెల్లడైంది. బీఆర్ఎస్కు 41.2 శాతం ఓట్లతో 74 (ఐదు సీట్లు అటుఇటుగా) సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. కాంగ్రెస్ 29 (3 సీట్లు అటు ఇటుగా) సీట్లకు, బీజేపీ 6 (రెండు సీట్లు అటుఇటుగా) సీట్లకు పరిమితమవుతాయని వెల్లడైంది.
గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు అంతర్గత కుమ్ములాటలు, మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య అగాధాలను సృష్టించే పార్టీలపట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ పొరుగు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తెలంగాణ ప్రజలు వారిని నమ్మడంలేదు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం 41.2 శాతం ఓట్లతో బీఆర్ఎస్ 74 స్థానాలు సాధించే వీలుండగా, కాంగ్రెస్ పార్టీ 32.7 శాతం ఓట్లతో 29 స్థానాలు సాధిస్తుందని, 2.7 శాతం ఓట్లతో ఏడు స్థానాలు సాధించి మజ్లిస్ పార్టీ మూడో స్థానంలో, 14.3 శాతం ఓట్లు, ఆరు సీట్లతో బీజేపీ నాలుగో స్థానాల్లో ఉంటాయని వెల్లడించింది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసిన అనంతరం తమ ఫైనల్ ప్రీ-పోల్ సర్వే వివరాలను వెల్లడించనున్నట్టు ఎన్పీఐ ప్రతినిధులు తెలిపారు.
