సూర్యాపేట, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్లేవారేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. మీరు ఢిల్లీకి వెళ్లి రహస్యంగా గడ్కరీని, అమిత్‌షాను కలిసిన విషయం అందరికీ తెలుసునని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును సీబీఐకి అప్పగించి, ప్రధాని మోదీని కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసుల ఛేదనలో, టెక్నాలజీ వాడకంలో తెలంగాణ పోలీసులు నంబర్ వన్‌గా ఉన్నారని, కానీ మా పోలీసులకు చేతకాదంటూ కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ తీర్మానం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీబీఐకి కాదు ఇంకా సరిపోకుంటే మీరు, మీ సీఎం పోయి ఎఫ్‌బీఐకి ఇచ్చుకొండి.. కాదంటే నేతాన్యాహు కాళ్లు పట్టుకొని ప్రపంచంలోనే పేరున్న మోసాద్‌కు ఇచ్చుకోండని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అస్తవ్యస్థ పాలన
రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు ఏ మాత్రం సఖ్యత, సమన్వయం లేదని, అవగాహన లేకుండా అస్తవ్యస్థ పాలన చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. మంత్రులేమో యూరియా లేదని కేంద్రానికి విన్నపాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం యూరియా ఉన్నదంటూ సినిమా టికెట్ల క్యూలైన్‌తో పోల్చుతున్నారని దుయ్యబట్టారు. దీంతో అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనతో ఏనాడూ యూరియా కొరత రాలేదని గుర్తుచేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత స్పష్టంగా కనిపిస్తున్నదని విమర్శించారు. రోజుల తరబడి లైన్లో నిలబడ్డ రైతులు, మహిళలు కడుపుమండి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే.. పోలీసులను పంపించి బెదిరించడాలు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మైకు దొరికితే కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టుడు తప్ప ప్రభుత్వ పెద్దలకు వేరే పనిలేదని, మరోవైపు ప్రజల డబ్బులు దండుకోవడంలో మంత్రులు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏకైక శాఖ పోలీస్ శాఖ మాత్రమేనని, రాజకీయాలకతీతంగా పనిచేయాల్సిన వారు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నరని ఎద్దేవా చేశారు.
దిక్కుమాలిన ప్రభుత్వం
ఎస్ఎల్బీసీలో మృతదేహాలను బయటకు తీయడానికి ఇప్పటికీ దిక్కులేదని, ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తరచూ ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని నీళ్లను వాటర్‌లో కలిపే మంత్రి చెప్పడం సిగ్గు చేటని కోమటిరెడ్డిని వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వందల టీఎంసీల నీళ్లు ఒకవైపు సముద్రంలో కలుస్తుంటే, నల్లగొండ గడ్డపైన ఉన్న ఎస్ఎల్బీసీ, ఉదయసముద్రం ఎండుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వీటిని నింపలేని వారు తొలుత వాటిలో దూకాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.