మహబూబ్‌నగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) కూడా ఉమ్మడి పాలమూరు (Palamuru) జిల్లా పల్లెజనం బీఆర్ఎస్కే (BRS) జైకొట్టింది. నారాయణపేట మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో గత ఎన్నికల జోరు కొనసాగింది. అధికార పార్టీకి పల్లె జనం చుక్కలు చూపెట్టారు. ప్రలోభాలకు గురిచేసినా తమ గుండెల్లో గులాబీ జెండా ఉన్నదని నిరూపించారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధిక పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అనేకచోట్ట స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. చాలాచోట్ల రీకౌంటింగ్ నిర్వహించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలైన మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి చక్రం తిప్పారు. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు మంత్రాంగం ఫలించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు విడుతల్లో 519 సర్పంచ్ స్థానాల్లో దాదాపు 250కి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందడం విశేషం. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మర్రి జనార్దన్‌రెడ్డి సొంతూరైన నేరెళ్లపల్లిలో, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి స్వగ్రామం కోయిలకొండ మండలం శేరి వెంకటాపూర్‌లో, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్వగ్రామం ఆవంచలో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయకేతనం ఎగురవేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి విడత సీఎం రేవంత్‌రెడ్డికే చుక్కలు చూపించిన నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి రెండో విడతలోనూ సత్తా చాటారు. తిమ్మాజిపేట మండలంలో 24 పంచాయతీలలో ఏకంగా 15 స్థానాల్లో గులాబీ ప్రభంజనం సృష్టించారు. మేజర్ పంచాయతీలైన తిమ్మాజిపేట, పాలెం పంచాయతీలను కైవసం చేసుకున్నారు. మర్రి జనార్దన్‌రెడ్డి సొంత గ్రామంలో మీసాల పుష్ప 408 ఓట్ల భారీ ఆధిక్యతతో కాంగ్రెస్‌ను మట్టి కరిపించింది. తిమ్మాజిపేట మండలంలో గోరిట గ్రామంలో టాస్‌లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. స్వల్ప ఓట్ల తేడాతో దాదాపు 10 పంచాయతీలను కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తండ్రీ కొడుకులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలుగా ఉన్నా.. నియోజకవర్గంలో మర్రి సునామీకి కొట్టుకుపోయారు. దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట నియోజకవర్గంలో రాజేందర్‌రెడ్డి నువ్వా.. నేనా అనే రీతిలో కాంగ్రెస్‌తో పోటీపడ్డారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంటలో ఒక ఓటు తేడాతో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటమి చెందారు. కాంగ్రెస్ మద్దతుదారురాలు తిరుపతమ్మకు 605 ఓట్లు, బీఆర్ఎస్ బలపరిచిన పద్మమ్మకు 604 ఓట్లు వచ్చాయి.
సారంగాపూర్, డిసెంబర్ 14 : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్వగ్రామంలో ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో ఎక్కువ రావడంతో ఓటుచోరీ జరిగిందన్న ఆరోపణలొచ్చాయి. చెల్ల ని ఓటును సైతం లెక్కించి కాంగ్రెస్ మద్దతుదారును విజేతగా ప్రకటించినట్టు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆరోపించడం చర్చనీయాంశమైం ది. ఎమ్మెల్యే సొంతూరు జలాల్పూర్ జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, బీఆర్ఎస్ మద్దతుతో సరితా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ మద్దతుతో నవనీతావెంకట్రెడ్డి పోటీకి దిగారు. సర్పంచ్ ఓట్లు కౌంట్ చేయగా, పోలైన వాటి కంటే ఎక్కువ ఓట్లు చూపించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మొత్తం 809 ఓట్లు పోలవగా, లెక్కింపు తర్వాత 823 ఓట్లుగా అధికారులు ప్రకటించడం గందరగోళానికి తెరలేపింది. బీఆర్ఎస్ మద్దతుదారురాలికి 370 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి సైతం 370 ఓట్లే వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత చెల్లని ఓటును తీసి కాంగ్రెస్ అభ్యర్థి ఖాతాలో వేసి ఆమె గెలిచినట్టు ప్రకటించగా బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తంచేశారు.