BRS | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రజాసమస్యలను ఎత్తిచూపేందుకు బీఆర్ఎస్ సభ్యులు వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు రోజుకోతీరు నిరసనతో ఆకట్టుకుంటున్నారు. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలో, ఎమ్మెల్సీ కవిత మార్గదర్శకత్వంలో మండలి ఆవరణలో ఆందోళనలకు దిగుతున్నారు. ఓ రోజు మెడలో మిర్చిదండలతో వచ్చి మద్దతు ధరలేక అల్లాడుతున్న రైతాంగానికి అండగా నిలిచారు. మరోరోజు ఎండిన వరి కంకులతో వచ్చి రైతుల బాధలను వెలుగులోకి తెచ్చారు. ఇంకోరోజు నమూనా స్కూటీలను ప్రదర్శించి ఆరు గ్యారెంటీల్లో భాగంగా విద్యార్థినులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు మార్చి 13న మధుసూదనాచారి, కవిత, సత్యవతి రాథోడ్, సురభి వాణీదేవి, మహమూద్‌అలీ, ఎల్ రమణ, దేశపతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్, తాతా మధు, శంభీపూర్ రాజు, సత్యనారాయణ తదితరులు పసుపునకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. 17న మిర్చి దండలు, ఆకుపచ్చని కండువాలతో ఆందోళన చేశారు. మిర్చి పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 18న స్కూటీ నమూనా చిత్రాలను ప్రదర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు 18 ఏండ్లు నిండిన మహిళలు, విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 19న ఎండిన వరి కంకులతో వచ్చి నిరసన తెలిపారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, వెంటనే సాగునీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనలతో సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న తీరు జాతీయ మీడియాను సైతం ఆకర్షిస్తున్నది. టీవీ చానళ్లు, వివిధ ఆంగ్ల పత్రికల్లో కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. సత్వరమే స్పందించడమే కాకుండా పరిష్కారానికి ఉపక్రమించాల్సి వస్తున్నది. తెలంగాణతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అమల్లో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధినాయకత్వం సైతం ఇక్కడి పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.