పెనుబల్లి, జనవరి 1: ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరులో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఆదివారం దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గొర్రెల, మేకల పెంపకందారుల మాజీ చైర్మన్ గడిపర్తి రామకృష్ణయాదవ్ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలవడంతో బీఆర్ఎస్ విధివిధానాలను కేసీఆర్ ఆయనకు వివరించారు.
పార్టీ సిద్ధాంతాలు, సీఎం కేసీఆర్పై విశ్వాసంతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని, త్వరలో ఆంధ్రా నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను కలిసి పార్టీలో చేరనున్నట్టు రామకృష్ణయాదవ్ ప్రకటించారు. బీఆర్ఎస్ తరఫున ఆంధ్రా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.