వనపర్తి : రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, 19 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. అనంతరం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అంగన్ వాడీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యంమవుతుందన్నారు. అంగన్ వాడీ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి, కోట్లాది మందికి మీ చేతుల మీదుగా నిత్యం పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. అంగన్ వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
మానవీయ కోణంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరించేందుకే సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన వారు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.